గుంటూరులో దొంగ ఓట్ల కలకలం

May 14,2024 01:43

గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద టిడిపి. వైసిపి కార్యకర్తల మధ్య వాగ్వావాదం
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :
గుంటూరునగరంలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ఒకరి ఓటును మరొకరు వేస్తున్నారనే వివాదంపై పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. దొంగ ఓట్లు పోలవుతున్నాయని వైసిపి పశ్చిమ అభ్యర్థి విడదల రజని ఈమేరకు అధికారులటకు ఫిర్యాదు చేశారు. కొంతమంది మహిళలను ఎంపిక చేసుకుని సీరా స్థానంలో నెయిల్‌ పాలిష్‌,సిరా తొలగించే రసాయనాలు వాడి దొంగ ఓట్లు వేస్తున్నట్టు రజని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 68 నెంబరు పోలింగ్‌ బూత్‌లో అధికారులు టిడిపికి సహకరిస్తున్నారని ఆమె రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. వృద్దురాలి ఓటును ఒక యువతి చేత వేయించారని వైసిపి కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రజని స్వయంగాపోలింగ్‌కేంద్రం వద్దకు వచ్చి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.కొరిటపాడులో టిడిపి వారు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసిపి వారు అధికారులను నిలదీశారు. మంత్రి విడదల రజని,ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అధికారులతో వాగ్వావాదానికి దిగారు. టిడిపి, వైసిపి మధ్య ఘర్షణ ఏర్పడటంతో ఇరు వర్గాల వారినిపోలీసులు చెదరగొట్టారు. అలాగే ఎటి అగ్రహారంలోని ఎస్‌కెబిఎం పాఠశాలలో కార్పొరేటర్లు వెంకటరెడ్డి,రోషన్‌ హల్‌ చల్‌ చేస్తున్నారని టిడిపి వారు ఫిర్యాదు చేశారు. వెంటనే వారిని బయకు పిలిపించారు. గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్‌ కళాశాలలో కూడా వైసిపి కార్పొరేటరు మార్కెట్‌ బాబు పోలింగ్‌ కేంద్రంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని టిడిపి అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈవిషయంలో టిడిపి,వైసిపి మధ్య ఘర్షణ జరిగింది.పోలీసులువచ్చి లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు.

➡️