ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి

Apr 29,2024 20:58

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌: ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ నియోజకవర్గ సాధారణ పరిశీలకులుగా ప్రమోద్‌ కుమార్‌ మెహర్డ అన్నారు. ఎన్నికల తుది పోటీ జాబితాలో ఉన్న అభ్యర్థులు, వారి ప్రతినిధులు, రాజకీయ పార్టీల అభ్యర్థులతో సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సాధారణ పరిశీలకులుగా మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేటు ప్రదేశాల్లో ఎన్నికల ప్రచార రాతలు ఉండరాదన్నారు. ప్రచారంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా పాటించాలని ఆయన సూచించారు. కలెక్టర్‌, అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నిశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రచారంలో ఆయా అభ్యర్థులు తమ ప్రచారానికి మాత్రమే కట్టుబడి ఉండాలన్నారు. ప్రచారానికి ముందస్తు అనుమతి ఉండాలని స్పష్టం చేశారు. ఒకే తేదీ, ఒకే సమయంలో అనుమతులు ఇవ్వడం జరగదని చెప్పారు. ఎక్కడా నియమాల ఉల్లంఘనలు ఉండరాదని, ఒకరిపై ఒకరు దూషణలు, హింస చెలరేగేలా ప్రచారం ఉండరాదని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో పాడేరు, అరకు, రంపచోడవరంల్లో అనుమతులు పొందేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేనప్పుడు వాట్సప్‌ చేసేందుకు నెంబరుకు ఇస్తున్నామని, ఫాక్స్‌ రూపంలో కూడా సమర్పించ వచ్చని ఆయన తెలిపారు. ఎఎస్‌ ఆర్‌ జిల్లాలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌అల్లూరి సీతారామరాజు జిల్లా (ఎఎస్‌ఆర్‌)లో వివిధ పరిస్థితుల దృష్ట్యా పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు వరకు మాత్రమే జరుగుతుందని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి నిశాంత్‌ కుమార్‌ తెలిపారు. ఎఎస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారం మే 11న సాయంత్రం 4గంటలతో ముగుస్తుందని ఆయన చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ, కురుపాం, సాలూరు నియోజక వర్గాల పరిధిలో పోలింగ్‌ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు, పార్వతీపురం నియోజక వర్గంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు వరకు పోలింగ్‌ జరుగుతుందని ఆయన చెప్పారు. డిఆర్‌ఒ జి.కేశవ నాయుడు, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన ఎన్నికల పరిశీలకులుస్థానిక డివిఎం స్కూల్‌, కొత్తవలస, నర్సిపురంలో ఉన్న వివిధ పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల పరిశీలకులు డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, మహేంద్ర సోమవారం పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు పక్కగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్‌పి సునీల్‌ షెరాన్‌, తహశీల్దార్‌ కె.ఆనందరావు, ఆర్‌ఐ రామకృష్ణ, టౌన్‌ ఎస్సై తదితర అధికారులు పాల్గొన్నారు.

➡️