కౌంటింగైనా సజావుగా సాగేనా?

May 22,2024 20:03

 రోజూ కేంద్రాలను పరిశీలిస్తున్న అధికారులు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  :  ఎన్నికల కౌంటిగైనా సజావుగా సాగేనా? లేక పోలింగ్‌ రోజు సిబ్బంది పడ్డ అవస్థలు తిరిగి కొనసాగుతాయా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. కౌంటింగ్‌ సజావుగా జరగకపోతే ఫలితాల వెల్లడిలో ఆలస్యం అనివార్యమవుతుంది. అదే జరిగితే దాదాపు 21రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ప్రజానీకం తీవ్ర నిరాశకు గురికావాల్సి వస్తుంది. ఈనెల 13న నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నిర్వహణలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైన సంగతి తెలిసిందే. సిబ్బంది మూడు రోజులపాటు పోలింగ్‌ నిర్వహణలోనే ఉండిపోయారు. వారికి నిద్రహారాలు లేవు. ఆహారం సమకూర్చడంలో అధికారులు నిర్లక్ష్యం చేశారు. కొన్నిచోట్ల పాచిపోయిన ఆహారాన్ని ఇవ్వడంతో వాటిని భుజించలేని పరిస్థితి. కానీ, ఆహారం పేరిట రూ.లక్షల ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ సంగతి అటుంచితే, ఆ రోజు ఉదయం 12గంటల వరకు పోలింగ్‌ మందకొడిగా సాగినప్పటికీ ఎన్నికల సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నం చేయలేదు. ఈ ప్రభావంతో రాత్రి వరకు పోలింగ్‌ సాగింది. దీంతో, సిబ్బంది అష్టకష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి పోలింగ్‌ వివరాలు కూడా మరుచటి రోజు రాత్రి వరకు ఇవ్వలేని దుస్థితి దాపురించింది. మునుపటికి భిన్నంగా ఇవిఎం బాక్సులన్నీ నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రిషప్షన్‌ కేంద్రాలకు రప్పించడంతో గందరగోళ పరిస్థితి నెలకుంది. వాటిని అప్పగించి తిరుగు ప్రయాణం అయ్యేసరికి మరుచటిరోజు మధ్యాహ్నం వరకు సమయం పట్టింది. ఈ జాప్యం వివిధ పార్టీలు, స్వతంత్య్ర అభ్యర్థులు, వారి తరపు ఏజెంట్లును అసహనానికి గురిచేసింది. ఇంత కష్టపడినా తమకు తగిన పారితోషికం ఇవ్వలేదంటూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయులు వినతిపత్రం కూడా జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో కౌటింగ్‌ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోలింగ్‌ నిర్వహణపై వందల కొద్దీ సమావేశాలు, శిక్షణా తరగతులు, ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ విఫలమైన నేపథ్యంలో ఇప్పటికైనా తగిన ప్రణాళికతో ముందుకు సాగుతారా? లేక ఇప్పటి మాదిరిగా ప్రకటనలకే పరిమితమౌతారా? అన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. పార్ట్లీలు, ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల కోపతాపాలు చదురు ముదురు సంఘటనల వరకు వెళ్లే పరిస్థితి లేకుండా ఉండాలంటే సాయంత్రంలోపే ఫలితాలు వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. చీకటిపడితే ఆకతాయిలు, అల్లరిమూకలను పోలీసులు కంట్రోల్‌ చేయడం కత్తిమీద సాములా మారే ప్రమాదం లేకపోలేదు. అధికారులు ప్రణాళిక, ఆచరణ ఎలా ఉంటుందో వేచిచూల్సిందే.

➡️