ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎన్నికల మ్యానిఫెస్టో

  • సిపిఐ రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగ-ఉపాధ్యాయ, కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారమే భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఎన్నికల ప్రణాళిక అని గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఐ మేనిఫెస్టోను విడుదల చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెల 13వ తేదీ భారత పార్లమెంటుకు, మనరాష్ట్రంలో శాసనసభకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, ఎత్తుకు పైఎత్తులు, ఒకరిని మించి ఇంకొకరు ప్రజలకు వాగ్దానాలు గుప్పిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి గా 14 సంవత్సరాలు అనుభవం గడించిన సీనియర్‌ రాజకీయవేత్త, మరోవైపు మాట తప్పను- మడమ తిప్పను అని ఐదు సంవత్సరాల క్రిందట అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి స్వచ్ఛ రాజకీయాలు, నీతివంతమైన పాలన అందిస్తామని జనాన్ని నమ్మించడానికి ఉపన్యాసాలు ఇస్తూ పరస్పర, తిట్ల పారాయణాలతో ఊదరగొడుతున్నారని తెలిపారు. కేంద్రంలో 10 సంవత్సరాలుగా పాలన చేస్తున్న బిజెపి పార్టీ కరుడుగట్టిన కమ్యూనల్‌, కార్పొరేట్‌ లకు మాత్రమే గుమస్తా గిరి చేస్తూ అవినీతి, నేరపూరిత పాలనలో దేశ ఆర్ధిక ప్రగతి దీనస్థితికి చేరిందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలు నాశనమైపోయినాయన్నారు. ప్రజల సంపదలైన ప్రభుత్వ రంగ పరిశ్రమలు, సహజ వనరులైన ఆయిల్‌, గ్యాస్‌, బొగ్గు, స్టీల్‌, పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వేలు, ఇస్రో లాంటి సంస్థలు కార్పొరేట్‌ సంస్థలకు ధారా దత్త చేస్తున్నారని, దేశం పరాధీనము అవుతూవుందని, దేశ ప్రజలు బానిసలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాధిక నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బతీసే పద్దతులలో కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ జరిగిపోతున్నదని, మహిళలపై, మైనార్టీలపై, ఆదివాసీలపై, దళిత, బహుజనులపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఎవరికి రక్షణలేని పరిస్థితులు దాపురించాయని, సెక్యులర్‌ వ్యవస్థను రూపుమాపి, సమాఖ్య పాలనను తుంగలో తొక్కు తున్నారని విమర్శించారు. నిరుపయోగమైన గవర్నర్ల వ్యవస్థ రద్దు కొరకు, అందులో ప్రస్తుతం జరుగుతున్న దుర్వినియోగానికి స్వస్తి పలుకుదామన్నారు. పాలకులు వికసిత భారత్‌, సమ్మిళిత అభివద్ది అని మోసపుచ్చుతున్నారని, ఈ తరుణంలో ఇండియా కూటమికి అధికారం అప్పగిస్తే తామిచ్చిన ఎన్నికల హామీల అమలుకు చిత్త శుద్ధితో కషి చేస్తామని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఈ ఎన్నికలలో పోటీ చేస్తూ ప్రజా ప్రణాళికను ప్రజల ముందు ఉంచుతున్నామని, దానిలో జిల్లా కేంద్రాల్లోని ఇండిస్టియల్‌ ఎస్టేట్స్లో మూసివేతకు గురైన ఖాయలాపడ్డ చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను పునరుద్ధరణకు, చిన్న వ్యాపారవేత్తలకు అతి తక్కువ వడ్డీలతో సులభ వాయిదా పద్ధతులలో అప్పు ఇప్పించడానికి కషి చేస్తామని, గ్రామీణ కష్టజీవులకు భూ పంపిణీ కొరకు ఉద్యమిస్తామని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు అమలు జరిపి, భూమిలేని నిరుపేద కుటుంబాలకు సాగు భూములు పంపిణీ, 9/77 అసైన్డ్‌ చట్ట ప్రకారం అన్యాక్రాంతమైన అసైన్డ్‌ భూములను పేదలకే చెందేలా చర్యలు చేపడతామని, విద్యుత్‌ చట్టసవరణ బిల్లు ఉపసంహరణ, స్మార్ట్‌ మీటర్లు బిగింపు నిలుపుదల కొరకు పోరాటం చేస్తుందని, అదనపు భారాన్ని వినియోగదారులపై మోపకుండా అడ్డుకుంటామని, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పరిశ్రమలు, కారిడార్లు తదితర అభివద్ధి నిర్మాణాలలో భూములు కోల్పోయిన రైతాంగానికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములకు పరిహారం, పునరావాసం, పునర్నిర్మాణానికి కృషి చేస్తామని తెలియజేశారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో జగన్‌, బాబు, పవన్లకు వ్యతిరేకంగా కాంగ్రెసు, సి.పి.ఐ, సి.పి.యమ్‌, ఇండియా అలయన్స్‌ కూటమి ద్వారా పోటీ చేస్తున్నామని., బిజెపి కూటమితో ప్రత్యక్షంగా, పరోక్షంగా జతకడుతున్న పార్టీలను ఓడించాలని, ఇండియా కూటమి పార్టీలను గెలిపించాలని సిపిఐ ఈ మ్యానిఫెస్టో ద్వారా కోరుతున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు వెంకటసుబ్బయ్య, జిల్లా కార్యదర్శి పి.ఎల్‌ నరసింహులు, జిల్లా సహాయ కార్యదర్శి మహేష్‌, నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎమ్మెస్‌ రాయుడు, పట్టణ కార్యదర్శి సికిందర్‌, నాయకులు నాగేశ్వరరావు, నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️