ఎన్‌డిఎ కూటమి, వైసీపీలను ఓడించండి: సీపీఎం

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనను, బిజెపి తొత్తుగా మారిన వైసీపీలను ఓడించాలని సీపీఎం ప్రజలకు పిలుపునిచ్చింది. స్థానిక సుందరయ్య భవన్‌లో మంగళవారం నియోజకవర్గ స్థాయి సమావేశం నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నియోజకవర్గ కన్వీనర్‌ షేక్‌ మాబు మాట్లాడుతూ బీజేపీ దాని భాగస్వామ్య పక్షాలను దానికి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీలను ఓడిం చాలని, ఇండియా వేదికలో ఉన్న వామపక్షాలు బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ బాపట్ల పార్లమెంటు సంతనూతలపాడు అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. మాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేద న్నారు. మత ప్రాతిపదికన ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికి కావలసిన ప్రయత్నాలను చేస్తూనే ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో పెరిగిపోయిందని, వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. కార్మిక హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్‌ కోడ్లను తెచ్చి, కార్పొరేట్లకు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. దేశంలోని ప్రభుత్వ సంపదను మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతోందని అన్నారు. ధరలు నియంత్రించడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. ఎపికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేదని, అయినా రాష్ట్రంలోని టిడిపి, జనసేన, వైసిపి, బిజెపికి అంట కాగడం రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేయడమేనని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి దేశాన్ని ఆర్థికంగా దివాలా తీస్తూ దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్న బిజెపిని, దాని తొత్తు పార్టీలను ఓడించి ఇండియా వేదికలోని కాంగ్రెస్‌ పార్టీ తరపున బాపట్ల పార్లమెంటుకు పోటీ చేస్తున్న జెడి శీలంను, సంతనూతలపాడు అసెంబ్లీకి పోటీ చేస్తున్న పాలపర్తి విజేష్‌రాజ్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు కాలం సుబ్బారావు, ఉబ్బా ఆదిలక్ష్మి, పూసపాటి వెంకట్రావు, బంకా సుబ్బారావు, పల్లాపల్లి ఆంజనేయులు, టి శ్రీకాంత్‌, ఏ వెంకటేశ్వర్లు, కే పెద్దబ్బాయి, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️