దండుమారమ్మ ఉత్సవాలు ప్రారంభం

Apr 9,2024 21:05

ప్రజాశక్తి-విజయనగరం కోట :  కంటోన్మెంటులోని దేవీ దండుమారమ్మ దేవాలయంలో అమ్మవారి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈనెల 16 వరకు ఈఉత్సవాలు జరుగనున్నాయి. ప్రారంభ వేడుకల్లో విజయనగరం ఎస్‌పి ఎం. దీపికా పాటిల్‌, పార్వతీపురం మన్యం జిల్లా ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతోను స్వాగతం పలికారు. అనంతరం ఎస్‌పి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి పసుపు కుంకుమలు, వస్త్రాలు సమర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు ఉగాది, దండుమారమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దండుమారమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12న సామూహిక సహస్రనామ కుంకుమార్చన ఉదయం 9 గంటల నుండి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 16న అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని సాయంత్రం 5.30 గంటలకు డప్పులు, చిత్ర, విచిత్ర వేషాలతోను, కోలాటాలు, ప్రత్యేక కాళికా వేషంలోను, సాంస్కతిక కార్యక్రమాలతోనూ ఊరేగింపు నిర్వహించనున్నట్లుగా కమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 20న ఆలయ ప్రాంగణంలో అన్న సమారాధన నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎఆర్‌ డిఎస్‌పి యూనివర్స్‌, పార్వతీపురం ఎఆర్‌ డిఎస్‌పి అప్పారావు, విజయనగరం డిఎస్‌పి ఆర్‌.గోవిందరావు, ఆర్‌ఐలు ఎన్‌. గోపాలనాయుడు, రమేష్‌, శ్రీరాములు, శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు తాతరాజు, రవీశ్వరుడు, వాసు, శివ, లక్ష్మణ్‌, వాసు, శ్రీనివాసరావు, బోనంగి నాయుడు, బంగారి నాయుడు, బలరాం తదితరులు పాల్గొన్నారు.

➡️