వంచించే పార్టీలను ఓడించండి

Apr 30,2024 21:42

వామపక్షాలు, స్వతంత్ర అభ్యర్థుల గెలుపుతోనే ప్రజాస్వామ్యం

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయని బిజెపిని, అందుకోసం పోరాడుతామంటూ మోసం చేసిన వైసిపి, టిడిపిలను ఓడించాలని, అందుకోసం నికరంగా పోరాడిన వామపక్షాలు, స్వతంత్య్ర అభ్యర్థులను గెలిపించాలని ఎపి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు కోరారు. తద్వారా ప్రజాసమస్యల పరిష్కారం కావడంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమౌతుందన్నారు. లేదంటే నేటిపాలకులు దేశ సంపద లూటీ చేయడంతో పాటు రాజ్యాంగానికి తూట్లుపొడుస్తారని అన్నారు. స్థానిక గురజాడ పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల మన రాష్ట్ర అభివృద్ధి కుంటుబడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఎన్నికల్లో గెలిపిస్తే వీటిపై పోరాడుతామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిగానీ, గత ఎన్నికల్లో ఓట్ల కోసం బిజెపితో తెగతెంపులు చేసుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్‌ కల్యాణ్‌గానీ ప్రస్తుతం ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. వెనుకబడి ఉత్తరాంధ్ర, రాయలసీమ జీల్లాలకు కేంద్రం ఇప్పటి వరకు పావలా కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలుగు జాతి గర్వించదగ్గ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సహా ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి విక్రయిస్తుంటే, రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపక పోవడం సిగ్గుచేటన్నారు. ప్రత్యే రాయితీలు లేకపోవడం వల్ల మన రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదన్నారు. జగన్‌, చంద్రబాబు, పవన్‌ పరస్పరం విమర్శించు కోవడం వల్ల జనాల దృష్టి మళ్లించడం తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆడిన పదేళ్ల తోలుబొమ్మలాటలకు, నయవంచనకు ప్రస్తుత ఎన్నికల్లో జనం తగిన గుణపాఠం నేర్పుతారని అన్నారు. ఆంధ్ర మేథావుల ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్‌ జి.అప్పలనాయుడు, , ఫోరం ఫర్‌ బెటర్‌ విజయనగరం అధ్యక్షులు డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన విద్య, వైద్యం తదితర రంగాలను ప్రైవేటీకరించిన పాలకులు కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. శ్రామిక వికాస్‌ సంఘటన్‌ నాయకులు బి.యజ్ఞనారాయణ మాట్లాడుతూ మన దేశం పూర్వం ఈస్టిండియా కంపెనీ నుంచి విమక్తి పొందితే దేశంలో మోడీ అధికారంలోకి వచ్చాక వెస్ట్‌ ఇండియాకి విక్రయిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకులు బుల్లిరాజు పాల్గొని మాట్లాడారు.

➡️