ప్రహసనంగా పింఛన్ల పంపిణీ

Apr 3,2024 23:30

గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలోని సచివాలయం-1 వద్ద వృద్ధుల నిరీక్షణ
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో తొలిరోజు సామాజిక పింఛన్ల పంపిణీ ప్రహాసనంగా జరిగింది. ప్రభుత్వం బుధవారం ఉదయం 9 గంటల నుంచి పింఛన్లను అందచేస్తామని ప్రకటించడంతో ప్రతి సచివాలయం వద్దకు లబ్ధిదారులు చేరుకున్నారు. కానీ మధ్యాహ్నం వరకు ఎక్కడా పంపిణీ ప్రారంభం కాలేదు. బ్యాంకుల నుంచి సకాలంలో సచివాలయం ఉద్యోగులకు నిధులు అందకపోవటం, వచ్చిన నిధులను ఎంతమందికి ఇవ్వాలో సరైన ప్రణాళిక లేకపోవడం, తమ ఖాతాల్లో జమైన నిధులను డ్రా చేసుకోవడంలో ఎదురైన ఇబ్బందులతో సచివాలయ ఉద్యోగులు బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు దాదాపు 40 శాతం మందికి పింఛన్లు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లాలో 2.61 లక్షల మందికి పింఛను ఇవ్వాల్సి ఉండగా సాయంత్రం వరకు లక్ష మందికే ఇవ్వగలిగారు. మొత్తంగా పల్నాడు జిల్లాలో 44.70 శాతం మందికి, గుంటూరు జిల్లాలో 41.6 శాతం మందికి పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా అభయహస్తం, రాజధాని గ్రామాల్లోని పేదలకు పింఛన్ల సొమ్ము తొలి రోజు విడుదల కాలేదు. వీరికి గురువారం నుంచి ఇస్తామని అధికారులు తెలిపారు. బాపట్ల జిల్లాలో 41 శాతం పంపిణీ చేశారు. ప్రభుత్వం నిధులు బ్యాంకులకు జమచేయడంలో జరిగిన జాప్యం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో గందరగోళం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల్లో అవసరమైన మేరకు నిధులు లేకపోవడం వల్ల ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయానికి వెళ్లి సొమ్ము తీసుకురావాల్సి వచ్చింది. దీంతో మరింత జాప్యమైంది. పట్టణ ప్రాంతాల్లో కూడా నిధులు సకాలంలో రాలేదని, తమ సచివాలయం పరిధిలో ఉన్న లబ్ధిదారుల్లో సగం మందికి కూడా నిధులు రాలేదని ఉద్యోగులు తెలిపారు. బ్యాంకుల నుంచి నిధులను డ్రా చేసుకోవడంలో ఏర్పడిన జాప్యమే తప్ప ప్రభుత్వం నుంచి ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. కొన్నిచోట్ల నిధులు రాలేదని గురువారం పింఛన్లు ఇస్తామని సచివాలయం సిబ్బంది బోర్డులుపెట్టారు. లబ్ధిదారుల సంఖ్య అనుగుణంగా నిధులను ఉద్యోగుల ఖాతాలో ప్రభుత్వం జమ చేయలేదు. గుంటూరులో కృష్ణనగర్‌ రూ.ఆరు లక్షల రావాల్సి ఉండగా రెండు లక్షలే వచ్చాయి. తూర్పు నియోజకవర్గంలో పాత గుంటూరు ఒక సచివాలయంలో బుధవారం ఉదయం ఎడ్మిన్‌ ఉద్యోగికి రూ.18 వేలే అతని ఖాతాలో జమయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని చాలా సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభం కాలేదు. మరోవైపు ఐదేళ్లుగా ఇంటి వద్ద పింఛను తీసుకుంటున్న వృద్ధులు వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు మండే ఎండలో సచివాలయాలకు రావడానికి అనేక ప్రయాసల గురయ్యారు. చాలాచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు వృద్దులు, వికలాంగులు, మహిళలు పడిగాపులు కాశారు. క్యూలైన్ల విధానం కూడా లేకపోవడం వల్ల గుంపులుగా గుమిగూడటం కన్పించింది. మరోవైపు లబ్ధిదారులను ఆకట్టుకునేందుకు టిడిపి, వైసిపిలు మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లును పోటీపడి పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీలో జాప్యానికి, ఇళ్ల వద్ద పంపిణీని చంద్రబాబు నాయుడే అడ్డుకున్నారని ఆయా సచివాలయాల వద్ద వైసిపి నాయకులు, కార్యకర్తలు నానా హంగామా చేశారు. టిడిపి వారుకూడా ప్రభుత్వం నిధులు విడుదలలోనే జాప్యం చేసిందని తమ తప్పిదం ఏమి లేదని లబ్ధిదారులను ఊరడించే ప్రయత్నం చేశారు.
ఇబ్బందులను నివారించండి : సిపిఎం
సామాజిక పింఛన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఎదురవుతున్న ఇబ్బందులను నివారించడంలో అధికారులు తగిన శ్రద్ధ వహించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. తొలిరోజు పింఛన్ల పంపిణీలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. సకాలంలో సొమ్మును ఉద్యోగులకు అందచేయకపోవడం వల్ల తీవ్ర జాప్యమైందని, తగిన సమాచారం ముందుగానే లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు. మిగతా మూడ్రోజులైనా లబ్ధిదారులకు ఇబ్బందుల్లేకుండా ఎప్పటికప్పుడు పంపిణీని పూర్తి చేయాలని, ఎండ తీవ్రత దృష్ట్యా అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.

➡️