లెక్కింపులో అలసత్వం వద్దు

May 24,2024 00:18

లెక్కింపు కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లపై మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రకడ్బందీగా జరిగేలా చర్యలు చేపట్టాలని, ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సిబ్బంది ఎవరూ అలసత్వం ప్రదర్శించకూడదని పల్నాడు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికలాధికారి శ్రీకేశ్‌ లత్కర్‌ ఆదేశించారు. నరసరావుపేట మండలం కాకాని గ్రామ పరిధిలో గల జెఎన్‌టియు కళాశాలలో ఓట్ల కౌంటింగ్‌ ఏర్పాట్లను ఆయన ఎస్పీ మలికా గార్గ్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రంలో నిరంతరం విద్యుత్‌ సరఫరా అయ్యేలా చూడాలన్నారు. కౌంటింగ్‌ రోజు కళాశాల ప్రహరీ చుట్టూ 100 మీటర్లు వరకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని, 100 మీటర్ల లోపలికి ఏ వాహనాన్ని అనుమతించకూడదని చెప్పారు. ప్రధాన ద్వారం వద్ద పోలింగ్‌ ఏజెంట్లను అభ్యర్థులను కౌంటింగ్‌ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపల పంపించాలన్నారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారులు ముందుగానే కౌంటింగ్‌ ఏజెంట్లకు, అభ్యర్థులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కౌంటింగ్‌ రోజున నిర్వహించవలసిన విధివిధానాల గురించి అవగాహన కల్పించాలని ఆదేశించారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌ రూములను తెరవాలన్నారు. ప్రతి నియోజకవర్గ కౌంటింగ్‌లో సంబంధిత రిటర్నింగ్‌ అధికారి ఇన్‌ఛార్జి వ్యవహరిస్తారన్నారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాల మీద ప్రత్యేక నిఘా ఉంచామని, జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అనుమానితులను బైండోవర్‌ చేస్తున్నామని తెలిపారు. జూన్‌ 6వ తేదీ వరకు ర్యాలీలు, ఊరేగింపులు, బాణాసంచాలు కాల్చడం పూర్తిగా నిషేధమన్నారు. పరిశీలనలో మాచర్ల నియోజకవర్గ ఆర్‌ఎ, జిల్లా జెసి ఎ.శ్యాం ప్రసాద్‌, రిటర్నింగ్‌ అధికారి రమణకాంత్‌రెడ్డి, నరసరావుపేట ఆర్డీఓ పి.సరోజిని, ఈవీఎం నోడల్‌ అధికారి అజరు కుమార్‌ పాల్గొన్నారు.కౌంటింగ్‌ కేంద్రం వద్ద డ్రోన్ల ఎగురవేత నిషేధంఓట్ల లెక్కింపు కేంద్రమైన జెఎన్‌టియు కళాశాలలో ప్రాంగణంలో లేదా సమీప గ్రామాల్లో మానవ రహిత డ్రోన్లను ఎగురవేయడం నిషేధమని కలెక్టర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. నిబంధన అతిక్రమింస్తే చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

➡️