చంద్రబాబును నమ్మొద్దు

Apr 30,2024 21:31

ప్రజాశక్తి-మెరకముడిదాం : ఎన్నికల్లో గెలవడం కోసం అమలు సాధ్యం కాని హామీలిస్తున్న చంద్రబాబును నమ్మొద్దని మంత్రి, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొత్ప సత్యనారాయణ ఓటర్లను కోరారు. మంగళవారం మండలంలోని మెరకముడిదాం, ఊటపల్లి, పులిగుమ్మి గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మెరకముడిదాంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ మంచి జరగాలన్నా, సంక్షేమ ప్రభుత్వం కావాలన్నా ప్రతి ఒక్కరు ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. మారుమూల గ్రామాలకు తాగునీరు, రోడ్డు సౌకర్యం కల్పించామని, కోట్లాది రూపాయలతో నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఒక్క పైసా లంచం లేకుండా పథకాలు అందుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల ద్వారా లంచాలు దండుకున్నారని ధ్వజమెత్తారు. ప్రతి నెలా తెల్లవారే సరికి మీ గుమ్మం దగ్గరికి వచ్చి పైసా లంచం లేకుండా వాలంటీర్లు పింఛన్లు అందిస్తే దానిని కూడా రాజకీయం చేసిన చంద్రబాబునాయుడును నమ్మవద్దని తెలిపారు. ‘మీకు మంచి జరిగింది అంటేనే మమ్మల్ని ఆశీర్వదించండి’ అని కోరారు. కార్యక్రమంలో జెసిఎస్‌ మండల కన్వీనర్‌ రాము, తాడ్డి వేణు, ఎస్‌ వి రమణరాజు, కోట్ల వెంకటరావు, బూర్లె నరేష్‌, పప్పల క్రిష్ణమూర్తి, సత్తారు జగన్‌ మోహనరావు పాల్గొన్నారు.

➡️