సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా నాటికలు

సామాజిక పరిస్థితులను ప్రతిబింబించేలా నాటికలు

ప్రజాశక్తి -అనకాపల్లి : అనకాపల్లి గవరపాలెం వివి రమణ రైతు భారతి ఓపెన్‌ ఆడిటోరియంలో మూడు రోజులుగా జ్యోతి సరళ స్మారక కళాపరిషత్తు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి తృతీయ నాటికల ప్రదర్శనలు నేటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్నాయి. జరుగుతున్న సంఘటనలను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుండడంతో ప్రేక్షకులు హర్షిస్తున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో భాగంగా ఆదివారం మొదటి ప్రదర్శన అభినయ విశాఖపట్నం వారి కాశీవాసి రావయ్య, రెండవ ప్రదర్శనగా విజయవాడ హర్ష క్రియేషన్స్‌ వారి మనస్సాక్షి ఎంతో ఆకట్టుకున్నాయి.మానవత్వం విలువలు లోపిస్తున్న నేటి సమాజంలో ఎవరి తలకు వాళ్లే కొరివి పెట్టుకునే రోజు వస్తుందని ఊహించి ఈరోజే రాసిన నాటిక ఓ కాశీ వాసి రావయ్య. తండ్రి కొడుకుల్ని వేరు చేయడానికి ఒక కోడలు దురుద్దేశంతో అన్న మాటలు చేష్టలతో చేతలుడికిన ఆ వృద్ధుడు చేసుకున్న ఆత్మాహుతి, అనంతరం అతని అస్థికలను తీసుకెళ్లేందుకు కూడా ఇష్టపడని కొడుకును చూసి కాటి కాపరి కాశీకి తీసుకువెళ్లిన దృశ్యం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. డబ్బు బంగారంపై ఉన్న ప్రేమ కనీసం సాటి మనిషిగా నైనా చూడని కథాంశం ఆకట్టుకుంది. ఇక డాక్టర్‌ పి బ్రహ్మానందం రచించి, కత్తి శ్యాం ప్రసాద్‌ దర్శకత్వం వహించిన రెండో నాటిక ప్రదర్శించిన మనస్సాక్షి ఇతివృత్తాన్ని పరిశీలిస్తే ప్రతి మనిషికి మనస్సాక్షి ఉంటుంది. అది కుటుంబ సంస్కృతి సాంప్రదాయాల, సంస్కారం వలన రూపు దిద్దుకుంటుంది. అయితే ఈ నాటికలో చంద్రశేఖర్‌ పాత్ర తన మనస్సాక్షికే భిన్నంగా ధనార్జనే జీవిత ధ్యేయంగా అక్రమంగా డబ్బు సంపాదిస్తాడు. అదే పందేలు తన కొడుకు కూడా వ్యవహరించి తండ్రికి కీడు చేస్తాడు. దీంతో చంద్రశేఖర్‌ పశ్చాత్తాప పడి డబ్బు శాశ్వతం కాదనే నిర్ణయానికి వస్తాడు. మనిషికి కావలసింది పిడికెడు మెతుకులు, బారెడు గుడ్డ, ఆరడుగుల స్థలం మాత్రమే శాంతిని ఇస్తుందనే సందేశాన్నిచ్చే నాటిక మనస్సాక్షి. నిర్వాహకులను ప్రజలు అభినందిస్తున్నారు.

మనస్సాక్షి నాటికలో సన్నివేశం

➡️