అమ్మకానికి పొగాకు సిద్ధం

Feb 23,2024 23:18
పొగాకు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
జిల్లాలో పొగాకు కొనుగోలుకు బోర్డు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 14వ తేదీ నుంచి పొగాకు బోర్డులో వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని గోపాలపురం, దేవరపల్లి, రాజమహేంద్రవరం రూరల్‌తో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని 4 మండలాల్లో 66,500 ఎకరాల్లో పొగాకు సాగు జరుగుతోంది. బోర్డు పరిధిలో 14,600 బ్యారెన్ల పరిధిలో 57,500 ఎకరాల సాగుకు మాత్రమే అనుమతి ఉంది. అధికారుల గణాంకాల ప్రకారం 8,750 ఎకరాలకు అదనంగా సాగు జరిగింది. ప్రతి ఏటా కేజీ సగటున రూ.180 నుంచి రూ.200 మించిన దాఖలాలు లేవు. గతేడాది అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడటంతో వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేశారు. ఒక దశలో కేజీ రూ.280 కూడా పలికింది. సగటున రూ.248.41చొప్పున కొనుగోలు జరిగాయి. జిల్లాలో టుబాకో బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఈ ధరే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏర్పడిన డిమాండ్‌ నేపథ్యంలో ఈ ఏడాది అత్యధిక మంది వర్జీనియా పొగాకునే సాగు చేశారు. ఇటీవల రైతులు, రైతు సంఘాలతో చర్చలు జరిపి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోళ్లకు మూడు దశల్లో తేదీ ఖరారు చేశారు. మొదటి, రెండో దశలలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా మూడో దశలో మార్చి 14 నుంచి జిల్లాలో కొనుగోలు ప్రారంభం కానున్నాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెంలలో ఒక్కొక్కటి, జంగారెడ్డిగూడెంలో రెండు మొత్తం 5 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది సీజన్‌ ప్రారంభ రోజుల్లోనే మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్జీనియా పరిధిలో పొగాకు పంట దారుణంగా దెబ్బతింది. పంటను దున్నేసి మరలా మొదటి నుంచి నాట్లు వేశారు. పెట్టుబడులతో పాటు అధిక ధరలకు నారు కొని సాగు చేయడంతో పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగింది.గతేడాది పొగాకు చరిత్రలోనే అనీవినీ లేని ధరలతో రికార్డులు సష్టించాయి. వేలం ప్రక్రియ ప్రారంభం రోజు నుంచే ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. రికార్డు స్థాయిలో కేజీ పొగాకు గరిష్టంగా రూ.288 నమోదై రాష్ట్రంలోనే ఆల్‌టైం రికార్డును నమోదు చేసుకుంది. పదేళ్ల క్రితం కేజీ పొగాకు రూ.200 మైలు రాయిని దాటింది. ఆ తరువాత 2019లో కేజీ ధర రూ.230 నమోదవ్వగా 2020లో కేజీ పొగాకు రూ.245 ధర పలకడంతో రికార్డుకెక్కింది. తరువాత గతేడాది రూ.288తో మరో రికార్డు సష్టించింది. ఈ ఏడాది కూడా ఆశాజనకంగా ధరలు రావాలని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

➡️