అస్తవ్యస్తంగా గామన్‌ నిర్వహణ

Mar 27,2024 22:38
అస్తవ్యస్తంగా గామన్‌ నిర్వహణ

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి తూర్పు గోదావరి జిల్లాలోని గోదావరి నదిపై కోల్‌కతా-చెన్నరు హైవేను కలుపుతూ ఏర్పాటైన గామన్‌ వంతెన నిర్వహణా లోపం అధికార యంత్రాంగం చిత్తశుద్ధికి దర్పణం పడుతోంది. తాజాగా వైబ్రేషన్స్‌ ఘటన వంతెన నాణ్యతలో డొల్లతనాన్ని ఎత్తిచూపింది. గోదావరి నదిపై 5.06 కిలో మీటర్ల పొడవున 81 పిల్లర్లలతో ఈ వంతెనను నిర్మించారు. తాజాగా 57-58 పిల్లర్‌ కింద ఏర్పాటు చేసిన బేరింగ్‌ మరమ్మతుకు గురైనట్టు అధికారులు చెబుతున్నారు. పిల్లర్లకు 500 మీటర్ల వరకూ ఇసుక తవ్వకాలు చేపట్టకూడదనే నిబంధన ఇక్కడ ఆచరణలో అమలుకు నోచుకోవట్లేదు. గామన్‌ బ్రిడ్జికి ఇరువైపులా యథేచ్ఛగా ఇసుక డ్రెడ్జింగ్‌ జరుగుతోంది. అయినప్పటికీ అధికారులు నోరు మెదపట్లేదు. ఇసుక డ్రెడ్జింగ్‌ కారణంగానే పిల్లర్‌ కుంగి బేరింగ్‌లు జారిపోయాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రివర్‌ గోదావరి బ్రడ్జి లిమిటెడ్‌ (గామన్‌ ఇండియా లిమిటెడ్‌) సంస్థ 2009లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోలో రూ.512 కోట్ల అంచనాలతో ప్రారంభమైన ఈ వంతెన 36 నెలల కాల వ్యవధి అనగా 2012 జూన్‌ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. సకాలంలో పూర్తికాకపోవడంతో అంచనా వ్యయాన్ని రూ.808 కోట్లకు పెంచి ఎట్టకేలకు 2015 అక్టోబరు నాటికి పూర్తి చేశారు. కోల్‌కత్తా నుంచి చెన్నరును కలిపే ఈ హైవేపై నిత్యం వేలాది వాహనాల రాకపోలు జరుగుతుంటాయి. ప్రకాష్‌ అస్ఫాల్ట్‌ టోల్‌ హైవే ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వంతెన నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తుంది. గతంలో వంతెనపై రోడ్డు కుంగిపోయి రాకపోకలు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. ఆ సమయంలోనూ నిర్వహణా సంస్థ పట్టించుకోలేదు. ఈ సమయంలో రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా ఆందోళన సైతం చేపట్టారు. తాజా ఘటనతో నిర్వహణా లోపాలు మరోసారి బయట పడ్డాయి. వంతెన సమీపంలోనే డ్రెడ్జింగ్‌ గామన్‌ వంతెన సమీపంలో యథేచ్ఛగా ఇసుక డ్రెడ్జింగ్‌ జరుగుతోంది. అధికార పార్టీ అండదండలతో ఓ వ్యక్తి ఇసుక డ్రెడ్జింగ్‌ కాంట్రాక్టు తీసుకున్నాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన యంత్రాలతో నదిలోని ఇసుకను తోడి స్టాక్‌ పాయింట్‌లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు తెలంగాణ, చెన్నరు రాష్ట్రాలకు తరలిస్తున్నారు. రాత్రి వేళల్లో వంతెన సమీపంలోనూ ఇసుక డ్రెడ్జింగ్‌ జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. పిల్లర్‌ కుంగిపోయిన సమయంలోనూ బ్రిడ్జి కింద ఇసుక డ్రెడ్జింగ్‌ను మాత్రం ఆపలేదు.

➡️