కాంగ్రెస్‌తోనే ప్రత్యేక హోదా సాధ్యం

Mar 26,2024 09:21
ప్రత్యేక హోదా

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమని పిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ స్పష్టం చేశారు. స్థానిక వై.జంక్షన్‌ ఆనం రోటరీ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేస్తానన్న రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీని ఆమె ప్రస్తావించారు. కాంగ్రెస్‌ తన హామీ నెరవేరుస్తుందన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు కూడా కాంగ్రెస్‌ అమలు చేస్తుందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రత్యేక హోదా, విభజన హామీలను విస్మరించి ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం చేసిందన్నారు. గతంలో టిడిపి, ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం కూడా ఈ విషయంలో నోరు మెదపలేదని విమర్శించారు. మెడలు వంచి హోదా తెస్తానన్న జగన్‌ ఎందుకు తేలేదని నిలదీశారు. పాచిపోయిన లడ్డూలు అని విమర్శించిన పవన్‌కళ్యాణ్‌ ఇప్పుడు ఆ విషయం మరిచిపోయి, తెలుగుదేశంతో పొత్తుకు మధ్యవర్తిత్వం వహించడం శోచనీయమన్నారు. బిజెపికి టిడిపి, జనసేన, వైసిపి తొత్తులుగా మారిపోయాయని ఆమె విమర్శించారు. రాజకీయ బిక్ష పెట్టిన కాంగ్రెస్‌ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేసి, సోనియా గాంధీ చలవతో దేశవిదేశాల్లో జరిగిన సభల్లో ప్రాతినిధ్యం పొందిన పురందేశ్వరి ఆంధ్రప్రదేశ్‌కి ద్రోహం చేసిన బిజెపిలో చేరి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ, ఇప్పుడు రాజమండ్రి పార్లమెంట్‌ నుంచి పోటీకి దిగుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి చేయడం గురించి ఎందుకు నోరుమెదపలేదని ఆమె ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ విషయంలో ఎందుకు మాట్లాడలేద న్నారు. వీటికి సమాధానం చెప్పే వరకు రాజమండ్రి పార్లమెంట్‌ నియోజకవర్గంలో తిరగనివ్వొద్దని ప్రజలకు పద్మశ్రీ నిచ్చారు. మట్టి, నీరు తెచ్చి హడావుడి చేసిన మోడీ రాష్ట్ర ప్రజల నోట్లో మట్టిగొట్టి తీరని అన్యాయం చేశారన్నారు. ఇండియా కూటమి బలపడుతోందన్న భయంతో జార్ఖండ్‌, ఢిల్లీ సీఎంలను అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. ఎవరెన్ని చేసినా ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆమె పేర్కొన్నారు. అరెస్టుల పేరిట అటు మోడీ, ఇటు జగన్‌ భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్‌ శ్రేణులు భయపడబోరని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్‌ కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పోరాటం చేస్తారని ఆమె తెలిపారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అరిగెల అరుణ కుమారి మాట్లాడుతూ, మహాలక్ష్మి కాంగ్రెస్‌ అమలు చేసే పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్‌, జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు మార్టిన్‌ లూథర్‌, పార్టీ సీనియర్‌ నాయకుడు నలబాటి శ్యామ్‌, పిసిసి అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాసరావు, ఎం.మాధవ్‌ పాల్గొన్నారు.

➡️