చట్టబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి

Mar 5,2024 23:50
చట్టబద్ధతతో ఎన్నికల విధులు నిర్వర్తించాలి

ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రూరల్‌ఎన్నికల్లో విధులను చట్టబద్దతతో నిర్వహించాలని కలెక్టర్‌ మాధవీలత సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఎన్నికల విధులు, బాధ్యతలపై కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌, డిఆర్‌ఒ జి.నరసింహులుతో కలిసి కలక్టరేట్‌ అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాధవీలత మాట్లాడుతూ, ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బాధ్యతలను కేటాయించారన్నారు. అప్పంగించిన అంశాలకు సంబంధించి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు, ఉత్తర్వుల మేరకు చేపడుతున్న కార్యకలాపాలు సమర్థవంతంగా చేయాల్సి ఉంటుందన్నారు. ఎప్పటికప్పుడు ఎలక్షన్స్‌ సెల్‌తో సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని ఆదేశించారు. డిఆర్‌ఒ సమన్వయకర్తగా కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఏ రోజు వచ్చిన టపాల్స్‌ ఆ రోజే పరిష్కరించడం, జవాబు ఇవ్వడం, వివిధ విభాగాలకు, కార్యాలయాలకు ఎండార్స్‌ చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. రోజూ వారీ కార్యాలయ విధుల్లో నిబద్ధత కలిగి ఉండని సందర్భంలో వివరణ కోరతామన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం చేస్తే, పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఎన్నికల విధులను సక్రమంగా చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసిన తదుపరి ఆయా పనుల్లో ఎటువంటి జాప్యానికి తావు లేకుండా చేపట్టాలన్నారు. అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలనిని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌ భరత్‌, డిఆర్‌ఒ జి.నరసింహులు, ఎఒ బివిఎస్‌.రామారావు, కలెక్టరేట్‌ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

➡️