దళారుల చెరలో దుంప రైతులు

Mar 9,2024 23:40
దళారుల చెరలో దుంప రైతులు

ప్రజాశక్తి- గోకవరంఈ ఏడాది దుంప ధర పెంచక పోతారా, పంట బాగా పండక పోతుందా అని ఎంతో ఆశతో రైతులు సాగు చేపట్టారు. దిగిబడి అంతంత మాత్రమే. మద్దతు ధర దుంప తెంచితే దిగుబడి రైతన్నను నిరాశ పర్చింది. పచ్చి దుంప పుట్టెకు గతేడాదియ రూ.2000 ఇస్తే ఈ ఏడాది రూ.1900 నుంచి రూ.1600కు పడిపోయిందని దుంప రైతులు చెబుతున్నారు. గోకవరం మండలంలోని మల్లవరం గ్రామంలో చేపడుతున్న కేరళ దుంప (ఎండబెట్టిన దుంప ముక్క) 70 కేజీలు గత సంవత్సరం రూ.2000 నుంచి రూ.2500 ఉంటే ఈ సంవత్సరం రూ.1600కు దించేశారు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని పెట్టుబడులు కూడా రావడం లేదని కౌలు రైతులు వాపోతున్నారు. ఈ దుంప ఎక్కువగా కేరళ, చెన్నై, తమిళనాడు రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఒకపక్క పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన రైతులను దుంపను ఎగుమతి చేసే దళారులు కుమ్మక్కయి గిట్టుబాటు ధర లేకుండా దోచేస్తున్నారన్నారు. దుంప రేటును తగ్గించి కొనుగోలు చేస్తున్నారన్నారు. గతంలో రాజమహేంద్రవరం, జగ్గంపేట, సామర్లకోట, పెద్దాపురం తదితర ప్రాంతాల నుండి కమీషన్‌దారులు వచ్చి నేరుగా రైతుల వద్ద నుండి దుంపను కొనుగోలు చేసేవారని అప్పట్లో గిట్టుబాటు ధర రూ.2000 నుండి రూ.2700 వరకు చెల్లించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, కమీషన్‌దారులు అందరూ కుమ్మక్కయి ధరను ఆమాంతరంగా తగ్గించేసి రైతులను దోచుకుంటున్నారు. అతి తక్కువ రూ.1600 నుంచి రూ.1500 చెల్లించి రైతులను నిలువునా దోచేస్తున్నారని దుంప రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెట్ట ప్రాంతమైన గోకవరం మండలంలోని మల్లవరం గ్రామంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో సుమారు 25 వేల ఎకరాలు కేరళ (ఫారం) దుంప సాగు చేపట్టారు. వర్షాధార పరిస్థితి సరిగా లేక దుంప పంటకు గడ్డుకాలం ఏర్పడింది. ఆరు నెలలపాటు కష్టించి సాగు చేసి ఫలితం కోసం ఎదురుచూస్తున్న రైతులకు నిరాశే మిగిలింది. దిగుబడి గణనీయంగా పడిపోయింది. మరోపక్క కనీస ధర లేకపోవడంతో తీవ్ర నష్టాలను రైతులు చవి చూస్తున్నారు. గతంలో ఫారం దుంప సాగుపై కౌలు రైతులు ఆసక్తి చూపించేవారు. గతంలో ఎకరానికి రూ.15000 చొప్పున కౌలు తీసుకునేవారు. పెట్టుబడి, కూలీలు కలిసి పంట చేతికి వచ్చేసరికి సుమారు రూ.45000 పెట్టుబడు అయ్యేది. వాతావరణం అనుకూలిస్తే సరిగ్గా వర్షాలు పడితే ఎకరానికి 50 బస్తాల నుండి 60 బస్తాలు వచ్చేది, ధర రూ.1500 వస్తే 60 బస్తాలకు ఆదాయం కౌలు రైతులకు సుమారు రూ.70 వేలు పైన చేతికి వచ్చేది. అప్పుడున్న పరిస్థితుల్లో రూ.55 వేలు ఖర్చు పోను ఎకరానికి సాగుపై రూ.20 వేల లాభం వచ్చేది. ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులు బాగా లేని కారణంగా దిగుబడి కనీస స్థాయికి పడిపోయింది. ఎకరానికి 30 నుంచి 35 బస్తాలకు పరిమితం అయ్యింది. ఈ పరిస్థితుల్లో ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ నష్టం వస్తుందని రైతులు చెపుతున్నారు. గతంలో మాదిరి రూ.2,500 మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

➡️