నిపుణులతో గామన్‌ వంతెన పరిశీలన

Mar 27,2024 22:44
నిపుణులతో గామన్‌ వంతెన పరిశీలన

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం, కొవ్వూరు రూరల్‌కలెక్టర్‌ మాధవీలత సాంకేతిక నిపుణులతో కలిసి బుధవారం గామన్‌ వంతెనను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వంతెనకు సంబంధించి 57-58 స్పాన్‌ వద్ద పిల్లర్‌కు చెందిన బేరింగ్స్‌ దెబ్బ తిన్నట్టు గుర్తించారన్నారు. ఎక్కువ స్థాయిలో కుదుపులు (వైబ్రేషన్స్‌) వస్తున్నట్లు వంతెన నిర్వహణ చేపట్టిన ఏజెన్సీ, ఆర్‌జిబిఎల్‌ సాంకేతిక నిపుణులు బేరింగ్‌ మరమ్మతులకు సంబంధించిన పనులు చేపట్టాలని నివేదిక అందజేశారని పేర్కొన్నారు. వంతెన మార్గంలో ప్రయాణించే వాహనాలు, వాటి బరువు తదితర సాంకేతికపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఏ రకమైన బేరింగ్‌ ఏర్పాటు చెయ్యాలో అంచనా వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆ మేరకు సంభందిత అవసరమైనా బేరింగ్‌ నమూనా అంచనా వేసినట్టు తెలిపారు. ఆ బేరింగ్‌ తయారు చేసే సంస్థను కూడా పూనే, భోపాల్‌లో గుర్తించామన్నారు. ఆ మేరకు బేరింగ్‌ తయారు చేసేందుకు ఆర్డర్స్‌ కూడా వచ్చినట్టు చెప్పారు. వాటి తయారీకి 10 రోజులు, ఏర్పాటు చేసేందుకు 5 రోజుల వ్యవధి పడుతుందని ఇంజినీర్స్‌ వెల్లడించారని తెలిపారు. సాధ్యమైనంత తక్కువ సమయంలో పనులు పూర్తి చేసేందుకు, అవరమైన పక్షంలో విమానం ద్వారా ఇక్కడికి బేరింగ్‌ తీసుకుని రావడం కోసం కూడా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే అక్కడికి ఇంజనీర్లను పంపామని కలెక్టర్‌ మాధవీలత తెలిపారు. రాజమండ్రీ నుంచి కొవ్వూరు వొచ్చే గామన్‌ వంతెన మార్గంలో ఒక వైపు మాత్రమే ట్రాఫిక్‌ మళ్లింపు చేయనున్న దృష్ట్యా ట్రాఫిక్‌ సమస్య రాకుండా పోలీస్‌, రవాణా, టోల్‌ ప్లాజా ఏజెన్సీ, రెవెన్యూ అధికారులు అధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. కలెక్టర్‌ వెంట రాజమండ్రీ గోదావరి బ్రిడ్జి లిమిటెడ్‌ చీఫ్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ఎహెచ్‌ ఖురేషీ, నేషనల్‌ హైవే ఇఇ సురేంద్ర బాబు, ఇఇ ఆర్‌డిసి ఎ.శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️