మునికూడలిలో ఇసుక దొంగలు

Feb 14,2024 22:27
ఇసుక

అనుమతులు లేకుండానే తరలింపు
రూ.కోట్ల విలువైన ఇసుక దోపిడీ
ప్రజాశక్తి – సీతానగరం
సీతానగరం మండలం మునికూడలి ఇసుక దొంగలు పడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనధికారికంగా ర్యాంపులు నిర్వహిస్తున్నారు. రాత్రిపగలు తేడా లేకుండా రూ.కోట్లాది విలువైన ఇసుకను తరలించేస్తున్నారు. ఇదంతా కళ్లముందే జరుగుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారుల వైఖరిపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక తవ్వి, రవాణా చేయడానికి ప్రతిమా ఇన్‌ఫ్రాస్ట్రకర్చర్‌ అనే ప్రయివేటు సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ అదేశాల మేరకు అనుమతులన్న ర్యాంపుల నుంచి సంస్థ ఇసుకను సేకరించి సరఫరా చేస్తుంది. కాని సీతానగరం మండలంలో ఎలాంటి అనుమతులు లేకపోయిన ప్రయివేటు వ్యక్తులు అనధికార ర్యాంపులను నిర్వహిస్తూ ఇసుకను తవ్వేసుకుంటున్నారు. మునికూడలి, కాటవరం, బొబ్బిల్లంక ర్యాంపులకు ఇప్పటి వరకూ ఎన్‌జిటి నుంచి సంబంధిత సంస్థకు ఎలాంటి అనుమతులు రాలేదు. జనవరి 25న జరిగిన రాష్ట్ర స్థాయి మినిట్‌ సమావేశంలోనూ సీతానగరం మండలానికి సంబంధించి ఏ ర్యాంపునకూ అనుమతుల ప్రస్తావనే లేదు. కాని మునికూడలి ఇసుక ర్యాంపు నుంచి మూడు నెలలుగా భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ వందల లారీల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సంబంధిత అధికారులకు పట్టించుకున్న దాఖలాలు లేవు. అటు ప్రభుత్వం కాని, ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్న సదరు గుత్తెదారు సంస్థ సైతం దీనిపై నోరు మెదపటంలేదు. ప్రక్కిలంక ర్యాంపునకూ పర్యావరణ అనుమతులు ఇంకా రాలేదు. రెండున్నర నెలలు నుంచి ఇక్కడ నుంచీ లక్షల టన్నుల ఇసుక తరలిపోతుంది. అటు భూగర్భ మరియు గనులశాఖ అధికారులుగాని, ఇటు రెవెన్యూ, ఇరిగేషన్‌, రవాణా, ఎస్‌ఇబి, టాస్క్‌ఫోర్స్‌, గ్రౌండ్‌ వాటర్‌ అధికారులు గానీ ఈ అక్రమ తవ్వకాలపై కనీసం నోరు కూడా మెదపట్లేదు. నెలకు రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల విలువచేసే ఇసుక తరలిపోయినట్టు సమచారం. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇప్పటికే లక్షల టన్నుల ఇసుకను దోచుకుపోయారు. రైతుల పట్టాభూములు, ప్రభుత్వానికి సంబంధించిన భూమి అనే తేడా లేకుండా ప్రభుత్వానికి సీనరేజీ పన్ను కట్టకుండా ఇసుకను తవ్వేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ అక్రమ ఇసుక దందాపై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పలుమార్లు అందోళనలు నిర్వహించినా చర్యలు శూన్యం. ప్రశ్నిస్తే బెదిరింపులు,దాడులుఇసుక అక్రమ తవ్వకాలను ప్రశ్నించినవారిపై మాఫియా దాడులకు సైతం దిగుతోంది. దళిత యువకుని శిరోముండనం ఈ కోవలో జరినదే. వార్తా సేకరణకు వెళ్తున్న విలేకరులను సైతం అక్రమార్కులు బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని, విచారణ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుతున్న ప్రాంతాల్లో సర్వే చేసి, ఎంత మేరకు నష్టం వాటిల్లిందో చట్టప్రకారం ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లించాల్సిన ధనాన్ని రికవరీ చేయాలని కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్న భారీ యంత్రాలు, రవాణా చేస్తున్న లారీలను సీజ్‌ చేయాలని కోరుతున్నారు.
అనుమతులు లేవు
సీతానగరం మండలంలో ఏ ఇసుక ర్యాంపునకు పర్యావరణ అనుమతులు లేవు. కొత్తగా అనుమతులు రావాల్సి ఉంది. ఓపెన్‌ ఇసుక రీచ్‌లకూ అనుమతులు లేవు.
-ఎడి, జిల్లా భూగర్భ, గనులశాఖ
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
మునికూడలిలో ఇసుక అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది ఓపెన్‌ ఇసుక రీచ్‌ల జాబితాలో కూడా లేదు. మైనింగ్‌ ప్లాన్‌లో మునికూడలి ఇసుక ర్యాంపు గురించి పేర్కొనలేదు. సీతానగరం మండలంలో ఓపెన్‌ రీచ్‌ల కోసం మైనింగ్‌ శాఖ జియో కోఆర్డినేట్‌లను పేర్కొనలేదు. సీతానగరం మండలంలో ఏ ఇసుక ర్యాంపునకూ పర్యావరణ అనుమతి లేదు. భారీ యంత్రాలను ఉపయోగించి గోదావరి నదిలో 20 అడుగుల లోతు వరకూ ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పోలీసు శాఖ, మైనింగ్‌ శాఖ, రెవెన్యూ శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.
– బొడ్డు వెంకటరమణ చౌదరి, టిడిపి నాయకులు
ప్రశ్నించినందుకే శిరోముండనం
అక్రమ ఇసుక రవాణాపై ప్రశ్నించినందుకు ఇండుగమెల్లి వరప్రసాద్‌ అనే యువకుడికి పోలీస్‌ స్టేషన్లో శిరోముండనం చేశారు. రైతులపై అక్రమ కేసులు పెట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలపై పంచాయతీ అధికారుల నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. పోలీసులు, మైనింగ్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు తప్పుడు నివేదికలతో ఈ ఫిర్యాదులను మూసివేశారు. సిబిఐ లేదా ఈడితో విచారణ జరిపించి, శిక్షించాలి.
– చిడిపి నకులసురేష్‌, న్యాయవాది.

➡️