సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి

Jan 31,2024 23:10
సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, రాజానగరంమారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కాకినాడలోని జెఎన్‌టియుకె 10వ స్నాతకోత్సవంలో బుధవారం గవర్నర్‌ పాల్గొన్నారు. పిహెచ్‌డి అవార్డు గ్రహీతలు, బంగారు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జెఎన్‌టియుకె న్యాక్‌ ఎం గ్రేడ్‌, యుసిఇకె ఎన్‌ఐఎ గుర్తింపు సాధించినందుకు యూనివర్శిటీ అధికారులను ప్రశంసించారు. వికసిత్‌ భారత్‌-2047 లక్ష్యాన్ని సాధించడంలో దేశంలోని యువతకు మార్గనిర్దేశం చేసే బాధ్యత విశ్వవిద్యాలయాలపై ఉందన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడంలో విద్యా సంస్థల బాధ్యత ఎంతో ఉందన్నారు. ప్రజల అభివ్ధృతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. తమను తాము విశ్వసించాలని, తమ జ్ఞానం, సామర్థ్యాలపై అత్యంత విశ్వాసం చూపాలని సూచించారు. ప్రకాశవంతమైన రేపటి కోసం ఆశాజనకంగా ఉండాలని సూచించారు. ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు నైతిక, రాజ్యాంగ విలువలు, సామాజిక శాస్త్రాలు, కళలు, మానవీయ శాస్త్రాలు, భాషలు, ఉత్సుకత, శాస్త్రీయ స్వభావం, సృజనాత్మకత, సేవాస్ఫూర్తి, సాంకేతికత అధ్యయనం చేసేలా రూపొందించాలని కోరారు. ముఖ్యఅతిథి ఎస్‌.వెంకట శేషాచారి మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను ఒడిసిపట్టాలని, ఎప్పటికప్పుడు విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని, భవిష్యత్తులో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు కృషి చేస్తోందన్నారు. విసి జివిఆర్‌.ప్రసాదరాజు మాట్లాడుతూ జెఎన్‌టియుకె యూనివర్శిటీ 3.45 స్కోర్‌తో న్యాక్‌ ఎం గ్రేడ్‌ పొందిందని తెలిపారు. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 ప్రకారం ఆర్‌-23 సిలబస్‌ను రూపకల్పన చేశామన్నారు. స్వీయ అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపర్చడం కోసం మరిన్ని ఆన్‌లైన్‌ కోర్సులను ప్రారంభించబోతున్నామన్నారు. జెఎన్‌టియుకె పరిధిలోని 22 ఇంజనీరింగ్‌, ఫార్మశీ కళాశాలలు 2023-2024 విద్యా సంవత్సరం నుంచి స్వయం ప్రతిపత్తి పొందాయన్నారు. స్నాతకోత్సవంలో 64 మందికి పిహెచ్‌డి అవార్డులు, 21 మందికి బంగారు పతకాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, రెక్టార్‌ ప్రొఫెసర్‌ కెవి. రమణ, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎల్‌.సుమలత, ఒఎస్‌ ప్రొఫెసర్‌ డి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.రాజానగరం : విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు సాధించిన జ్ఞానం ప్రపంచానికి ఉత్తమ పౌరులుగా అందిస్తుందని గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఎన్‌టిఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో విసి ప్రొఫెసర్‌ కె.పద్మరాజు అధ్యక్షతన బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్‌ మాట్లాడారు. విద్యను సమాజ శ్రేయస్సుకు సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సంపాదించిన జ్ఞానం సంకుచిత, మత పరమైన ఆలోచనలకు దారితీయ కూడదని సూచించారు. జీవితంపై విస్తత, సానుభూతితో కూడిన అవగాహనకు దారితీయాలని, విశ్వవిద్యాలయంలో పొందిన జ్ఞానం, ప్రపంచ పౌరులుగా మారడానికి సహాయం చేస్తుందన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి తెలుగు సాహిత్యంలో గొప్ప శాస్త్రీయ కవి నన్నయ పేరు పెట్టారని, ఆయన కవితా దృష్టి అసమానమైనదని, స్వేచ్ఛానువాదం, మానవ సంస్కతి అభివద్ధిలో ఆయనది ఒక గొప్ప యుగంగా చెప్పారు. ముఖ్య అతిథి ఇన్ఫోసిస్‌ చైర్‌పర్సన్‌, పద్మభూషణ్‌ సుధా నారాయణమూర్తి మాట్లాడుతూ కాలేజిలో గడిపిన జీవితానికీ, సమాజంలో జీవితానికి చాలా తేడా ఉంటుంన్నారు. సమాజంలో గౌరవంగా ఉండేవిధంగా ఉండాలన్నారు. మనకు జన్మనిచ్చిన తల్లి ఏలా గౌరవిస్తాము అదేవిధంగా ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా మాతృభాషను గౌరవించాలన్నారు. అనంతరం కోర్సులు పూర్తి చేసిన 8582, అండర్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన 50173 మంది విద్యార్థులకు పట్టాలు పంపిణీ చేశారు. ఇన్ఫోసిస్‌ అధినేత సుధా నారాయణమూర్తి తెలుగు, సంస్కత అకాడమీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ నందమూరి లక్ష్మీపార్వతికి గవర్నర్‌ డాక్టరేట్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, వైసిపి సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సుధాకర్‌, ఎస్‌పి పి.జగదీష్‌, జెసి ఎన్‌.శేషు భరత్‌ పాల్గొన్నారు.

➡️