సాగు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు

Feb 4,2024 22:08
సాగు, తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిరానున్న వేసవి కాలంలో సాగు, తాగునీటికి రైతులకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు కార్యాచరణ చేపట్టాలని జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్‌ వేణుగోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వేణుతోపాటు, ఎంపి వంగా గీత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కాకినాడ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్‌పి చైర్మన్‌ వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం, జిల్లా ప్రగతి సాధన అంశాలలో చైతన్యవంతమైన కృషి చేస్తూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్‌ పాలకమండలి రెండున్నర సంవత్సరాల కాలం విజయవంతంగా పూర్తి చేసుకుందన్నారు. ఇందుకు అన్ని విధాలా కృషి చేసిన సభ్యులు, సహకరించిన అధికారులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అనంతరం 2023-24 సంవత్సరానికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ సవరణ బడ్జెట్‌ ను, 2024-25 సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ ప్రతిపాదనలను సభ ముందు ఉంచాలని ఆయన జడ్‌పి సిఇఒను కోరారు.2023 – 24 బడ్జెట్‌ ఆమోదంవివిధ పద్దుల కింద రూ.883.34 కోట్లు ఆదాయం, రూ.882.79 కోట్ల వ్యయం అంచనాలుగా రూ.55 లక్షల మిగులుతో ప్రస్తుత 2023-24 సంవత్సరానికి సవరించిన బడ్జెట్‌ ప్రతిపాదనలను, రూ.886.95 కోట్ల ఆదాయం, రూ.886.33 కోట్ల వ్యయం అంచనాలతో రానున్న 2024-25 సంవత్సరానికి రూ.62 కోట్ల మిగులుతో అంచనా బడ్జెట్‌ ప్రతిపాదనలను జెడ్‌పి సిఇఒ ఎ.శ్రీరామచంద్ర మూర్తి పద్దుల వారీగా సమగ్రంగా వివరించి చర్చ, ఆమోదం కోసం సభ ముందు ఉంచారు. వివిధ అంశాల కింద ప్రతిపాదించిన కేటాయింపుల పట్ల సంతప్తి వ్యక్తం చేస్తూ సభ ఈ ప్రతిపాదనలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.వేసవిలో ఎద్దడి లేకుండాఅనంతరం సమా వేశంలో చేపట్టిన అజెండా సమీక్షలో తొలుత చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా అంశం కింద రానున్న వేసవి మాసాల్లో ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా చేపట్టిన ముందస్తు కార్యాచరణ చర్యల గురించి వివరించాలని సభ్యులు అధికారులను కోరారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని సమ్మర్‌ స్టోరీస్‌ ట్యాంకులను మార్చి 31 నాటికి పూర్తిస్థాయిలో నింపేందుకు చర్యలు చేపడతామని, బోరు బావుల ముందస్తు ఫషింగ్‌ నిర్వహిస్తామని, తాగునీటి ఎద్దడి ఎదురైన ఆవాసాలకు ట్యాంకుల రవాణా ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్‌ అధికారులు సభ్యులు వివరించారు. జల జీవన్‌ మిషన్‌ కింద చేపట్టిన స్టోరీస్‌ ట్యాంకుల నిర్మాణం, ఇంటింటికి తాగునీటి సరఫరాకు పైపులైన్‌ విస్తరణ పనులను వేగవంతం చేయాలని పలువురు సభ్యులు అధికారులు కోరారు. గోదావరి చెంతనే ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మెట్ట, డెల్టా ప్రాంతాలు వేసవి మాసాల్లో తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని, జల జీవన్‌ మిషన్‌ కింద చేపట్టిన పనులను సంబంధిత కాంట్రాక్టర్లు నిర్దిష్ట కాల పరిధిలో సకాలంలో పూర్తిచేసేలా ఆదేశాలు జారీ చేయాలని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అధికారులను కోరారు. వ్యవసాయ శాఖ సమీక్షలో రబీ పంటలకు అవసరమైన ఎరువులు, అపరాల పంటలకు అవసరమైన విత్తనాలకు ఇటువంటి కొరతలేదని అధికారులు వివరించారు. గోదావరి కాలువల వ్యవస్థ కింద తాళ్లరేవు, కాజులూరు మండలాల్లోని శివారు భూములకు, ఏలేరు వ్యవస్థలో శివారున ఉన్న పిఠాపురం ప్రాంత భూములకు సాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని ఎంపీ వంగా గీత, పలువురు జెడ్‌పిటిసి సభ్యులు కోరారు. రబీ పంటలకు సాగునీటి సమస్య తలెత్తకుండా వ్యవసాయ ఇరిగేషన్‌ శాఖల సమన్వయంతో వంతులవారీ విధానాన్ని అమలు పరుస్తున్నామని కలెక్టర్‌ కృతికాశుక్లా సభ్యులకు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో అమలవుతున్న పనులు, పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బి శాఖల ద్వారా చేపట్టిన పనులు ప్రగతిని సభ సమీక్షించింది. విద్యాశాఖ సమీక్షలో ప్రభుత్వ పాఠశాలకు విలువైన కంప్యూటర్లు, అత్యాధునిక బోధన పరికరాలు ప్రభుత్వం సమకూర్చుతోందని, వీటి భద్రతకు పాఠశాలలో నైట్‌ వాచ్‌మెన్‌ను నియమించాలని సభ్యులు సూచించారు. మంత్రి వేణు మాట్లాడుతూ పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని అన్నారు. సమావేశంలో సభ్యులు సూచించిన అంశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో కాకినాడ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య, అంబేద్కర్‌ కోనసీమ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నూపూర్‌ అజరు, తూర్పు గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎన్‌.తేజ్‌భరత్‌, జెడ్‌పి వైస్‌ చైర్మన్‌ బుర్రా అనుబాబు, జెడ్‌పిటిసిలు, ఎంపిపిలు కో ఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు.

➡️