ఖరీఫ్‌ సాగుకు ప్రణాళిక సిద్ధం

May 23,2024 23:15
ఖరీఫ్‌ సాగుకు ప్రణాళిక సిద్ధం

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లాలో ఖరీప్‌ సాగుకు సంబంధించి వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధమైంది. వరితో పాటు మినుములు తదితర సాగు మొత్తం 2.07 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు ఖరీప్‌ ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. ప్రధానంగా 1.92 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ వరి సాగును చేసేందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ధాన్యం వరికోతలు పూర్తయిన వెంటనే దుక్కులు దున్ని సాగుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో బోర్ల కింద వరి సాగులో వరి నారుమళ్లు వేసేందుకు రైతులు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే రైతులు సాగుకు సంబంధించి పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. తొలకరి వర్షాలు కురిసిన వెంటనే సాగు ప్రారంభిస్తారు. ఇక బోర్ల కింద సాగులో మాత్రం ముందస్తుగా వరి సాగు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే వరి నారుమళ్లు వేసేందుకు విత్తనాలను సిద్ధం చేసుకున్నారు.అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలుజిల్లాలో ఖరీఫ్‌ వరి సాగుకు భూసారాన్ని పెంచేందుకు వినియోగించే పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులో ఉన్నాయి, ఈ విత్తనాలను 50 శాతం సబ్సిడీతో రైతులకు అందజేయనున్నారు. 434 క్వింటాళ్ల జీలు, 150 క్వింటాళ్ల జనుము, 30 క్వింటాళ్ల పిల్లిపెసర విత్తనాలను అందుబాటులో ఉంచారు. జీలుగ, జనుము విత్తనాలు కిలో ధర రూ.88 కాగా రూ.44కు పిల్లిపెసర కిలో రూ.134 కాగా రూ.67కు అంద జేయనున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా వరి విత్తనాలు 38,908 క్వింటాళ్లు అవసరం కాగా 400 క్వింటాళ్ల ఎపి సీడ్స్‌, 10 వేల క్వింటాళ్లు ప్రైవేటు సంస్థల ద్వారా మిగిలిన వాటిని రైతుల నుంచి రైతులకు సరఫరా చేయనున్నారు. జిల్లాలో ఎంటియు-7029, పిఎల్‌ఎ-1100, బిపిటి-5204, ఎంటియు-1318 వంటి రకాలు అత్యధికంగా సాగు చేస్తున్నారు.ఖరీఫ్‌కు సిద్ధంగా ఎరువులుఖరీఫ్‌ సాగుకు వ్యవసాయ శాఖ ఎరువులను అందుబాటులోకి తెచ్చింది. జిల్లావ్యాప్తంగా 58,836 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశారు. ఇప్పటికే 23,096 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో అవసరాలను బట్టి ఇంకా ఎరువులు సరఫరా అవుతాయని జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఖరీఫ్‌ ఫ్రారంభమైన తర్వాత విడతలు విడతలుగా ఎరువులు సరఫరా అవుతూనే ఉంటాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎస్‌.మాధవరావు తెలిపారు.

➡️