గాంధీ సేవాశ్రమాన్ని అభివృద్ధి చేయాలి

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల శాఖ అధ్యక్షులు టి.అప్పారావు

ప్రజాశక్తి – మండవల్లి

జాతిపిత మహాత్మా గాంధీ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజెప్పే విధంగా గాంధీ సేవాశ్రమాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మండల శాఖ అధ్యక్షులు టి.అప్పారావు కోరారు. నూతన ఎండోమెంట్‌ అధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన దివ్యశ్రీని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండవల్లిలో 5.50 సెంట్లలో గాంధీ ఆశ్రమం ఉందన్నారు. స్వాతంత్రం వచ్చిన తొలి రోజుల్లో గాంధీ సేవాశ్రమంలో రాట్నంతో నూలు ఒడుకుట, కూరగాయల, మల్బరీ తోటల పెంపకం, కుట్టు మిషన్లు, అల్లికలు వంటి కుటీర పరిశ్రమలు నిర్వహించేవారన్నారు. అయితే వాటివల్ల పేద, బడుగు, బలహీన వర్గాలు ఎంతగానో ఉపయోగపడేవని తెలిపారు. ఈనాడు ఆ పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా స్పందించి రహదారిని నిర్మించి ఆశ్రమం అభివృద్ధికి కృషి చేయాలని వారు ఆమెను కోరారు. ఈ సందర్భంగా దివ్యశ్రీ మాట్లాడుతూ రహదారి ఏర్పాటు చేసేలా ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరావు దృష్టికి తీసుకువెళ్లి రహదారి నిర్మించేలా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సభ్యులు ఎల్‌ఎస్‌.భాస్కరరావు, బండి రంగారావు, అర్జంపుటి రవి పాల్గొన్నారు.

➡️