మహిళల ఆర్థిక ప్రగతికి ‘తపన’ చేయూత

ప్రజాశక్తి – టి.నరసాపురం

మహిళల ఆర్థిక ప్రగతికి తపన ఫౌండేషన్‌ చేయూత నిస్తుందని తపన ఫౌండేషన్‌ ట్రస్టీ గారపాటి రేణుక అన్నారు. మండలంలోని తిరుమలదేవి పేట, శ్రీరామవరం గ్రామాల్లో తపన ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో గత 90 రోజులపాటు నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణా కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా మండలంలోని తిరుమలదేవి పేటలో మహిళలకు సర్టిఫికెట్లు ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 80 మంది మహిళలకు రేణుక చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రేణుక మాట్లాడుతూ ఉచిత కుట్టు శిక్షణా కేంద్రంలో తర్ఫీదు పొంది మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థిక పురోగతి సాధించాలనే ఉద్దేశంతో తపన ఫౌండేషన్‌ ద్వారా ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 20కి పైగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 2008 జనవరి 27న తపన ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి అప్పటి నుంచి వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతోందని, రానున్న రోజుల్లో తపన ఫౌండేషన్‌ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రఘు, అజరు, శివ గణేష్‌ పాల్గొన్నారు.

➡️