వర్జినియా పొగాకు రైతులను ఆదుకోవాలి

ప్రజాశక్తి – జీలుగుమిల్లి

ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన వర్జీనియా పొగాకు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. శనివారం జీలుగుమిల్లి మండలం పాములవారి గూడెంలో పొగాకు రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్జినియా పొగాకు రైతులు మిచౌంగ్‌ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పొగాకు పంట నష్టాలకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. పొగాకు బోర్డు నిధి నుంచి ఒక్కో రైతుకు రూ.10 వేలు చొప్పున వడ్డీ లేని రుణంగా ఇస్తున్నట్లు చెబుతున్నా దీనివల్ల పొగాకు రైతులు కోలుకునే పరిస్థితి ఉండదని, ఇది కంటి తుడుపు చర్య మాత్రమేనని అన్నారు. పంట నష్టాలకు అనుగుణంగా పరిహారం ఇచ్చి ఆదుకోకపోతే అప్పులు తీర్చే మార్గం లేక పొగాకు రైతులు మరింతగా ఇబ్బందులు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, సింహాద్రి శ్రీనివాసరావు, బిక్కిన వీరసత్యం పాల్గొన్నారు.

➡️