వేసవిలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

వేసవి కాలంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా ఉంటే వడదెబ్బ, ఇతర అంటు వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని జిల్లా అసిస్టెంట్‌ మలేరియా అధికారి జె.గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు కస్తూరిబా మున్సిపల్‌ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వడదెబ్బ, దాని నివారణ మార్గాలు, ఇతర అంటు వ్యాధులపై, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఎక్కువగా ఎండలో ఆడుకోవడం వల్ల, అధిక వేడి వల్ల మన శరీరంలో ఉండే నీరు చెమట రూపంలో బయటికి పోవడంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. తీవ్రమైన వడదెబ్బ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగడం, తీవ్రమైన జ్వరం రావడం, డిహైడ్రేషన్‌కు గురవడం, వాంతులు అవడం, ఆయాసపడి నిరసించుకుపోవడం, స్పృహ తప్పిపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. వడదెబ్బ నుంచి రక్షించుకోవాలంటే 12 గంటల్లోపు పనులు ముగించుకోవడం, మరలా నాలుగు గంటల తర్వాత పనులు చేయడం, ఎక్కువగా ద్రవపదార్థాలైన కొబ్బరి బొండాలు, మజ్జిగ, ఒఆర్‌ఎస్‌ ద్రావణం, మంచినీరు తీసుకోవడం, లేత రంగు కాటన్‌ దుస్తులు ధరించడం వంటివి చేయాలన్నారు. బయటకు వెళ్లేటప్పుడు తలకు తలపాగా టోపీ, లేదా గొడుగు వాడాలని సూచించారు. ఎక్కువగా వడదెబ్బకు వయసులో పెద్దవారు, విద్యార్థులు, గర్భిణులు, చిన్నపిల్లలు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. అలాగే వేసవికాలంలో సాధారణ జ్వరాలు కూడా వచ్చే అవకాశం ఉందని, మనకి ఎక్కువగా హాని చేసే మలేరియా, డెంగీ దోమలు మంచి నీటి నిల్వ ప్రాంతాలలో పెరుగుతాయి కాబట్టి వారానికి ఒకసారి ఫ్రైడే డ్రైడే ఆచరించాలన్నారు. విద్యార్థులు ఎక్కువగా నులిపురుగు వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని, భోజనానికి ముందు హ్యాండ్‌వాష్‌ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సునీత, హెల్త్‌ సూపర్వైజర్‌ గొరిపర్తి శ్రీనివాసరావు, హెల్త్‌ అసిస్టెంట్‌ మేక శ్రీనివాస్‌, ఆరోగ్య కార్యకర్త బిబి జయినాబ్‌, ఆశా కార్యకర్తలు సునీత, రత్నకుమారి ఉపాధ్యాయులు ప్రసన్న కృష్ణమోహన్‌, సుబ్బారావు స్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️