గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలి

తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
కామవరపుకోట సర్వసభ్య సమావేశంలో ఎంపిపి విజయలక్ష్మి
ప్రజాశక్తి – కామవరపుకోట
రానున్న వర్షాకాలంలో ప్రజలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ముందుగానే పారిశుధ్య పనులు చేపట్టాలని, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎంపిపి మేడవరపు విజయలక్ష్మి చెప్పారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎంపిపి విజయలక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో ప్రజలకు సీజనల్‌ వ్యాధులు రాకుండా గ్రామాల్లో ముందుగానే పారిశుధ్య పనులు చేపట్టాలని, తాగునీరు సరఫరా చేసే ట్యాంకులను శుభ్రపరచాలని, అదేవిధంగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. కామవరపుకోటలోని కొన్ని ప్రాంతాల్లో రహదారులకు అంతరాయంగా విద్యుత్‌ స్తంభాలు ఉన్నాయని, వాటి వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉంటుందని, వాటిని పక్కకు మార్చాలని విద్యుత్‌ శాఖ సిబ్బందిని ఆమె కోరారు. జెడ్‌పిటిసి సభ్యులు కడిమి రమేష్‌ మాట్లాడుతూ మండలంలోని తడికలపూడి దగ్గర మెయిన్‌ రోడ్డు బాగా గోతులు పడటం వల్ల ప్రయాణికులకు అసౌకర్యంగా ఉందని, మరమ్మతులు చేపట్టాలని ఆర్‌అండ్‌బి అధికారులను కోరారు. త్వరలో రహదారుల మరమ్మతులు చేపట్టడంతో పాటు మండలంలోని కళ్లచెరువు, ఆసన్నగూడెం మధ్య ఉన్న గుండేరు వాగుపై వంతెన పాడైపోయినందున కొత్త బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.5.50 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. ప్రభుత్వ అనుమతుల రాగానే నిర్మాణం చేపడతామన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో ఈ వంతెనపై రాకపోకలకు అంతరాయం కలగకుండా సుమారు రూ.20 లక్షలతో డైవర్షన్‌ రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు ఆర్‌అండ్‌బి అధికారులు సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి తమ్మిశెట్టి గిరిజ, ఎంపిడిఒ జె.స్వర్ణభారతి, వివిధ శాఖల మండల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు పాల్గొన్నారు.

➡️