కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలి

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌
శ్రీసత్యసాయి మంచినీటి పథకం కార్మికులకు వేతన బకాయిలు తక్షణమే చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, శ్రీసత్య సాయి డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ మెయింటినెన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు డేగా ప్రభాకర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పని చేస్తున్న శ్రీసత్య సాయి డ్రింకింగ్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ మెయింటినెన్స్‌ వర్కర్స్‌కు బకాయిలు తక్షణం చెల్లించాలని కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌, జిల్లా పరిషత్‌ కార్యనిర్వహణాధికారి కెఎస్‌ఎస్‌.సుబ్బారావులకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీసత్య సాయి మంచినీటి పథకం ద్వారా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో సుమారు 180 గ్రామాలకు ఐదు లక్షల మంది ప్రజలకు తాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. ఈ పథకంలో వంద మంది కార్మికులు పని చేస్తున్నారని, ఈ పథకంలో పని చేస్తున్న కార్మికులకు జనవరి నెల నుంచి ప్రస్తుత మే నెల వరకు జీతాలు చెల్లించలేదన్నారు. సుమారుగా ఐదు నెలల నుంచి వేతనాలు లేవని, ఈ పథకంలో పని చేస్తున్న కార్మికులందరూ ఆర్థిక స్థోమతలేని, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వారని తెలిపారు. పల్లెల్లో పచారీ దుకాణాలలో సైతం అప్పు కూడా పుట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని, పిల్లల చదువులకు సంబంధించి ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారని, తక్షణమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. ఈ పథకంలో వివిధ గ్రేడుల్లో లైన్‌మెన్‌, ఆపరేటర్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రిషియన్‌, వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారని, గతంలో ఈ పథకం నిర్వహణ చేసిన ఎల్‌అండ్‌టి సంస్థ వారు కార్మికులకు 2021 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి 2021 జూన్‌ 15వ తేదీ వరకు రెండు నెలల జీతాలు చెల్లించలేదన్నారు. తరువాత ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం వద్ద 2021 జూన్‌ 15వ తేదీ నుంచి 2021 ఆగష్టు ఒకటో తేదీ వరకు పని చేశారని, ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం 45 రోజులు జీతాలు చెల్లించలేదన్నారు. నాలుగు నెలల జీతాలు చెల్లించలేదని అవి గాక, ఇప్పుడు నడుపుతున్న కొత్త కాంట్రాక్టరు ఐదు నెలల జీతాలు, ఇఎస్‌ఐ, ఇసిఎఫ్‌, బోనస్‌ చెల్లించడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి తక్షణం కార్మికులకు చెల్లించాల్సిన ప్రస్తుత ఐదు నెలల జీతాలు, పాత బకాయిలు నాలుగు నెలల జీతాలు ఇప్పించి, ఇఎస్‌ఐ, ఇపిఎఫ్‌ బోనస్‌ చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. జీతాల చెల్లింపునకు చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినందుకు కలెక్టర్‌, జిల్లా పరిషత్‌ కార్య నిర్వహణాధికారులకు డేగా ప్రభాకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు ఎంవిఆర్‌ఎస్‌.ప్రసాద్‌, ఉపాధ్యక్షులు శ్రీకాంత్‌, యూనియన్‌ సభ్యులు టి.భాస్కరరావు, ఎం.చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

➡️