ప్రతిఒక్కరూ ఓటేయాలి : కలెక్టర్‌

May 4,2024 23:02

ప్రచార రథాన్ని ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ప్రతి ఒక్కరూ ఓటేసేలా ఓటర్‌ స్లీప్‌లు కూడా పంపిణీ చేయించామని, ఐదేళ్లకు ఒకసారి వేసే ఓటుపై ఎవరూ నిర్లక్ష్యం వహించకుండా తమ హక్కును ఉపయోగించుకోవాలని పల్నాడు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌ వద్ద రోడ్డు సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘రండి ఓటు వేద్దాం – ఓటింగ్‌ శాతం పెంచుదాం’ వాల్‌పోస్టర్లను కలెక్టర్‌ శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆడియోతో  కూడిన సంచార ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఆర్‌.కె దుర్గా పద్మజ ఆధ్వర్యంలో కరపత్రాలు, బోర్డులు ఏర్పాటు చేయటంపై అభినందనలు తెలిపారు. మద్యం, డబ్బులు, బహుమతులు తీసుకోకుండా ఓటేయాలనే ప్రచారం మంచిదన్నారు. ఆర్‌. కె. దుర్గ పద్మజ మాట్లాడుతూ ప్రధానంగా అర్బన్‌ ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు ఓటు వేసే విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారని, వారికి కరపత్రాలు పంపిణీ చేసి ఓటు హక్కు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తామన్నారు.  కార్యక్రమంలో  ట్రైనీ కలెక్టర్‌ కల్పశ్రీ, రెవెన్యూ అధికారి వినాయకం, స్వచ్ఛంద సంస్థ  సభ్యులు బంగారయ్య, కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, సాంబశివరావు పాల్గొన్నారు.

➡️