పంట చేల లో మోటార్ సైకిల్ తో రైతుల నిరసన

ప్రజాశక్తి- తాళ్లరేవు: సాగునీరు లేక పంటలు బీటలు పడుతున్నాయని వెంటనే సాగునీరు అందించాలని కాకినాడ జిల్లా పి. మల్లవరం గ్రాంట్ ప్రాంతంలోని రైతులు పంట పొలాల్లో మోటార్ సైకిల్ నడుపుతూ నిరసన తెలియజేశారు. గ్రాంటు గ్రామం పరిధిలోని చిన తిప్పతూర, పంట కాలువ కు సంబంధించి సుమారు 80 ఎకరాలు, రాజులు కాలువ, పెదమడి కాపుల పంట కాలువ లకు సంబంధించి సుమారు 100 ఎకరాల వరి పంటకు సాగు నీరు లేక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమస్య పరిష్కారం కొరకు కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ను కలిసి గోడు వెలిబుచ్చినా అధికారులు ఎవరూ ఇప్పటికీ స్పందించలేదని రైతులు వాపోతున్నారు. పంట వేసిన నాటినుండి మొదటి నెల రోజులు సాగునీరు అందింది. తరువాత నుంచి రైతులు అనేక సార్లు ఇరిగేషన్ కార్యాలయంను ముట్టడించి ఆందోళన చేసిన ప్రతీసారీ ఇరిగేషన్ అధికారులు ఈశ్వర్, హిమబిందు, వ్యవసాయ అధికారి ప్రశాంతి పంట చేలను పరిశీలించడం తప్ప రైతులకు వంతులు వారి విధానం లోకూడా సాగునీరు అందిచలేదని రైతులు గుత్తుల మహేష్, కడలి శ్రీనివాస్, గుత్తుల కృష్ణ, భగవాన్, మావుళ్ళు, సూరిబాబు తదితరులు అన్నారు. అధికారులు నీరు అందించలేని పక్షంలో రైతులు అందరూ ఆత్మ హత్యలే దారి అన్నారు. ఇప్పటీకైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో గురువారం ఇరిగేషన్ కార్యాలయం ముట్టడించి తీరుతాం అన్నారు. వీరి వెంట తెలుగు యువత రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి ధూళి పూడి వెంకట రమణ తదితులున్నారు.

 

➡️