ఎపిలో చిత్ర పరిశ్రమ అభివృద్ధి జరగాలి

దర్శకులు ఉమామహేశ్వరరావు, భరత్‌ పారేపల్లి ను సత్కరిస్తున్న డాక్టర్‌ కొత్తమాసు శ్యామ్‌ ప్రసాద్‌, దర్శకులు దిలీప్‌ రాజా

తెనాలిరూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ లో సినీ పరిశ్రమ అభివృద్ధి పూర్తి స్థాయిలో జరగాలని సిని దర్శకులు సి. ఉమామహేశ్వర రావు అన్నారు. సిని దర్శకులు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని మూవీ ఆర్టిస్ట్‌ అసోసి యేషన్‌ శనివారం సినిమా దర్శకుల దినోత్సవ సంబరాలు నిర్వహించింది. మా ఎపి వ్యవస్థాపక అధ్యక్షులు, దర్శకులు దిలీప్‌ రాజా అధ్యక్షతన స్థానిక సుల్తానాబాద్‌ రత్న ఫార్ట్యూన్‌ కళ్యాణమండపంలో జరిగిన కార్య క్రమంలో దాసరి నారాయణరావు స్మారక పురష్కారాన్ని ఉమామహేశ్వరరావు, భరత్‌ పారేపల్లి అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దర్శకులు డాడీ శ్రీనివాస్‌, ఓం సాయి, బి.సోమసుందరం, చలవాది శివప్రసాద్‌ మా-ఎపి గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. వర్థమాన హీరోయిన్లు దివిజ, మౌనిక రెడ్డి, టీనా చౌదరిలను డాక్టర్‌ కొత్తమాసు శ్యామ్‌ ప్రసాద్‌ సత్కరించారు. అనంతరం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సినిమాల రూపకల్పనకు నూతన దర్శకులు ప్రయ త్నాలు చేయాలన్నారు. రేపటి తరం వారసులకు నూతన దర్శకుల చిత్రాలు మార్గదర్శకాలు కావాలన్నారు. దిలీప్‌ రాజా మాట్లాడుతూ వర్తమాన దర్శకులు నిర్మించబోయే చిత్రాల్లో ఎపి నటీ నటులకు అవకాశం కల్పించాలని కోరారు. ఎపి ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ మేనేజరు శ్రీనివాస నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సినిమాలు చిత్రీకరణకు అనువైన లొకేషన్లను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని తెలిపారు. షూటింగుల నిర్వహణకు దర్శకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. తొలుత చిన్నారి గ్రీష్మ శ్రీ ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్‌ ఐనంపూడి శరత్‌ బాబు దర్శక దినోత్సవ ప్రత్యేక గీతాన్ని ఆలపించారు.కారక్రమంలో దర్శకుడు కనపర్తి రత్నాకర్‌ పాల్గొన్నారు.

➡️