యథేచ్ఛగా తాగునీటి వ్యాపారం

Apr 3,2024 21:29

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : జిల్లాలో మినరల్‌ వాటర్‌ పేరుతో నాణ్యతా ప్రమాణాలు లేని ప్యాకేజి డ్రింకింగ్‌ వాటర్‌ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో నీటి వ్యాపారం మరింత జోరందుకుంది. అత్యధిక మంది వ్యాపారులు బోరు నీటినే క్యాన్లలో నింపి విక్రయిస్తున్నారు. కలుషిత జలాలను సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని పట్టణ కేంద్రాల్లో ఎక్కువ కుటుంబాలు క్యాన్లలో మినరల్‌ నీటినే వినియోగిస్తున్నారు. జిల్లా ప్రజలంతా కలిపి నీటి కోసం సుమారు ఏడాదికి రూ.10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. దీంతో పట్టణాల్లో, గ్రామాల్లో పుట్టగొడుగుల్లా నీటిశుద్ధి కేంద్రాలను (వాటర్‌ప్లాంట్లు) ఏర్పాటు చేస్తున్నారు. యజమానులకు ఒక్కో 20 లీటర్ల క్యాన్‌ నీటి తయారీకి రవాణా ఖర్చులతో కలిపి రూ.6 కంటే ఎక్కువ కావడం లేదు. వినియోగదారులకు మాత్రం రూ.10 నుంచి రూ.20వరకు విక్రయిస్తూ దోచుకుంటున్నారు. 200 మిల్లీలీటరక్ల వాటర్‌ ప్యాకెట్లు తయారుచేసి రూ.2 చొప్పున విక్రయిస్తున్నారు. వీటి పై తయారీ తేదీని, కాలం చెల్లిన తేదీని ముద్రించట్లేదు. కొన్నింటికే అనుమతులుజిల్లాలో సుమారు 600కి పైగా ఆర్‌ఒ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో పదుల సంఖ్యలో ప్లాంట్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయి. సాధారణంగా ఐఎస్‌ఐ ప్రమాణాలతో నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలంటే రూ.35 లక్షల నుంచి రూ.50లక్షల వరకు పెట్టుబడి కావాలి. జిల్లా పరిశ్రమల శాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నుంచి అనుమతులు ఉండాలి. కాని జిల్లాలో చాలా మంది రూ.3లక్షల పెట్టుబడి పెట్టి వివిధ సంస్థల పేరుతో అనధికారికంగా నీటిశుద్ధి ప్లాంటు ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. పలు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ.. కేవలం బోరువాటర్‌ ను క్లోరినేషన్‌ ప్రక్రియ చేసి వడపోసి క్యాన్లలో నింపుతున్నారు. మరికొన్ని ఆర్‌ఒ ప్లాంట్లలో కనీసం వడపోత కూడా లేకుండా బోర్లు, మున్సిపాలిటీ కుళాయి నీటిని క్యాన్లలో నింపి విక్రయిస్తున్నారు.ఈ నిబంధనలు తప్పనిసరిఆర్‌ ప్లాంట్లలో ముందుగా నీటిని క్లోరినేషన్‌ చేయాలి. తర్వాత ప్రత్యేకమైన శాండ్‌ ఫిల్టర్‌ ద్వారా వడపోయాలి. ఆపై కార్బన్‌ ఫిల్టర్స్‌, మైక్రాన్‌ ఫిల్టర్స్‌ శుభ్రం చేసి మరో కంపార్టుమెంటులోకి పంపాలి. ఆఖరి దశలో ఆక్సిజన్‌ను పంపి ఆక్సీకరణ చేయాలి. ఈ దశలో మినరల్స్‌ను జతచేయాలి. కాని ఆర్‌ఓ ప్లాంట్లలో ఈ దిశగా నీటిని శుద్ధి చేయడం లేదు. ఐఎస్‌ఐ ప్రమాణాలతో నడిచే ఆర్‌ ఒ ప్లాంట్లు జిల్లాలో నాలుగు మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. నీటిశుద్ధి కర్మాగారాలపై తరుచూ తనిఖీలు నిర్వహించి నాణ్యతా ప్రమాణాలు పరీక్షించాల్సి ఉన్నా ఇంతవరకు ఒక్క ప్లాంటు పైకూడా తనిఖీలు లేవు. ఆహార తనిఖీ విభాగం, ఫుడ్‌ ఇన్స్పెక్టర్లు, ఆర్డబ్యూఎస్‌ అధికారులు వీటి వైపు కనీసం కన్నెత్తి చూడటం లేదు. దీంతో కలుషిత నీటి వ్యాపారం యథేచ్ఛగా సాగిపోతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. మినరల్‌ పేరుతో కలుషిత జలాలను విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️