ఉద్యాన రైతు విలవిల

ప్రజాశక్తి-యర్రగొండపాలెం వర్షం జాడలేదు. కరవు నేలలో భూగర్భ జలం కానరాకుండా పోతోంది. బోర్లు, బావుల్లోని నీటి లభ్యతను నమ్ముకుని సాగు చేసిన ఉద్యాన పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. యర్రగొండపాలెం నియోజకవర్గం లోని ఐదు మండలాల్లో వర్షాధారంగా ఏటా 32 వేల హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. బోర్లు వేయించుకుని పంటలు సాగు చేసే రైతుల సంఖ్య పెరిగిపోయింది. ఐదు మండలాల్లో 20 వేల వరకు బోర్లు ఉన్నాయి. గత ఖరీఫ్‌ నుంచి వర్షం జాడ కరవయ్యింది. దీంతో ఎక్కడికక్కడ బోర్లలో నీటి లభ్యత అడుగంటుతోంది. చాలా వరకు బోర్లు, బావులు ఎండిపోయాయి. రబీలో సాగు చేసుకున్న వివిధ రకాల పంటలను కాపాడుకోవడానికి రైతులు అగచాట్లు పడుతున్నారు. ఉద్యాన పంటలకు నష్టం యర్రగొండపాలెం నియోజకవర్గంలో 11,316 ఎకరాల్లో వివిధ రకాల ఉద్యాన పంటలు సాగులో ఉన్నాయి. ఆ పంటలకు ఇప్పటికే రూ.లక్షల్లో ఖర్చు పెట్టారు. ఈసారి మామిడి, బత్తాయి, దానిమ్మ, నిమ్మ, బొప్పాయి, అరటి పంటలకు బహిరంగ మార్కెట్టులో మంచి ధర ఉంది. ఆయా పంటలు ప్రస్తుతం కాయ దశలో ఉన్నాయి. వాటికి నీటి లభ్యత చాలా అవసరం. తడులు ఇచ్చేకొద్దీ పంట దిగుబడి పెరగనుంది. బోర్లు అడుగంటుతుండగా పంటలకు నీటి తడులు అందడం ఇబ్బందిగా మారింది. తడి అందక అనేక గ్రామాల్లో ఉద్యాన పంటలు వాడు ముఖం పట్టాయి. వాటిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కొత్తగా రైతులు బోర్లు వేయిస్తున్నారు. వెయ్యి అడుగుల లోతు తవ్వించినా వాటిలో కూడా నీటి జాడలేదు. కళ్లెదుటే ఎండుతున్న ఉద్యాన పంటలను చూస్తున్న రైతులు విలవిలలాడి పోతున్నారు.

➡️