సార్వత్రిక పోలింగ్‌ ప్రశాంతం

అచ్యుతాపురం మండలంలో పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూలైన్‌లో ఉన్న దృశ్యం

ప్రజాశక్తి- విలేకర్ల యంత్రాంగం

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ చిన్న చిన్న సంఘటనలు మినహా అనకాపల్లి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సోమవారం ప్రశాంతంగా జరిగింది. పలు చోట్ల ఈవిఎంలు మొరాయించడంతో ఓటర్లు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. యలమంచిలి నియోజకవర్గంలో..యలమంచిలి : యలమంచిలి నియోజకవర్గం పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. మొదట మందకొడిగా ప్రారంభమైనా కాసేపట్లోనే ఊపందుకొంది. మున్సిపాలిటీలోని తెరువుపల్లి, తులసీనగర్‌లలో పొడవాటి ఓటరు క్యూలు కనిపించాయి. ఎన్నికల సిబ్బందికి ఆహారం అందించడంలో రెవెన్యూ సిబ్బంది విఫలయ్యారు. చాలా మంది ఆకలితోనే గడిపారు. ఎన్నికల తాజా ఓటింగ్‌ సరళి విలేకర్లకు అందించడంలో ఆర్‌ఓ సిబ్బంది విఫలమయ్యారు. చాలా ప్రాంతాల్లో ఓటరు నెంబరు స్లిప్పులు అందించలేదు. స్లిప్పులు లేనివారు వారి ఎక్కడుందనే సంగతి తెలీక రెండు మూడు పోలింగ్‌ కేంద్రాలకు తిరగాల్సివచ్చింది. ఓటింగ్‌ శాతం సరళిఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ 9 గంటల సమయానికి యలమంచిలి నియోజకవర్గంలో 6.62 శాతం ఓట్లు పోలయ్యాయని నియోజవర్గ ఆర్‌ఒ అనుపమ ప్రకటించారు. ఆ తర్వాత వరుసగా 11 గంటలకు 14, 69 శాతం, 12 గంటలకు 19 శాతం, 1 గంటకు 34.16 శాతం, 3 గంటలకు 47.54 శాతం, 4 గంటలకు 50.44 శాతం పోలయ్యాయి. పోలింగ్‌ పూర్తయిన సమయానికి 67.98 శాతం ఓటింగ్‌ నమోదైంది. మోసయ్యపేటలో చిన్నపాటి ఘర్షణఅచ్యుతాపురం : మండలంలోని పూడిమడక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ వద్దకు మత్స్యకారులు తెల్లవారు 4 గంటలకే వచ్చారు. తమకు ఓటుకు వేసే అవకాశం ఇస్తే వెంటనే ఓట్లు వేసి వెళ్తామని అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నిర్ణీత వేళలకు పోలింగ్‌ కేంద్రాలను తెరుస్తామని అధికారులు ఓటర్లకు నచ్చ చెప్పారు. అధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. మోసయ్యపేట పోలింగ్‌ కేంద్రం వద్ద వైసిపి, టిడిపి నాయకుల మధ్య ప్రారంభమైన వాగ్వివాదం ముదిరి చిన్నపాటి ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో తెలుగుదేశం పార్టీకి చెందిన యువకుడుకు స్వల్ప గాయాలయ్యాయి. వైద్య చికిత్సల నిమిత్తం అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అదే పోలింగ్‌ కేంద్రం వద్ద 11.30 గంటలకే ఓట్లు వేసేవారు లేక పోలింగ్‌ బూతు ఖాళీగా దర్శనమిచ్చింది. మంచినీటి సదుపాయం లేక ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. ఆవ సోమవారం పోలింగ్‌ కేంద్రంలో మిషిన్‌ కొంతసేపు పనిచేయక పోవడంతో పోలింగ్‌కు అంతరాయం ఏర్పడింది. గ్రామాలలో పోలింగ్‌ సరళిని పరిశీలించడానికి ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజరు కుమార్‌, టిడిపి నాయకులు ప్రగడ నాగేశ్వరరావు, రాజాన రమేష్‌ కుమార్‌, మాజీ జెడ్‌పిటిసి జనపరెడ్డి శ్రీనివాసరావు తదితరులు గ్రామాలలో పోలింగ్‌ కేంద్రాల వద్దకు పరిశీలించారు.మునగపాక : మండలంలో పోలింగ్‌ మధ్యాహ్నం వరకు మందకోడిగా సాగింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా పెరిగింది. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీ స్త్రీలు కుటుంబ సభ్యుల సహకారంతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లకు ఎండవేడి తగలకుండా ఎన్నికల అధికారులు టెంట్లు వేశారు. వాటర్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. మునగపాకలో రెండు పోలింగ్‌ కేంద్రాలలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ఈవీఎంలు మొరాయించడంతో గంటపాటు పోలింగ్‌ నిలిచిపోయింది. మండల వ్యాప్తంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజరు కుమార్‌, పలువురు వైసిపి నాయకులు పలు గ్రామాలలో పర్యటించి ఓటింగ్‌ సరళని పరిశీలించారు.మాడుగుల నియోజకవర్గంలో…దేవరాపల్లి : ఉత్కంఠ పరిస్థితులను నడుమ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. పలుచోట్ల ఎన్నికల సమయం ముగిసిన ఓటర్లు బారులు తీరి ఉండడంతో అందరికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు. వృద్దులు, వికలాంగులు, యువత తమ ఓటు వేయడానికి తరలివచ్చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని 127 బూత్‌లో ఈవీఎం పనిచేయకపోవడంతో సుమారు గంటన్నర సేపు పోలింగ్‌ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు పలు అవస్థలు పడ్డారు. 129, నాగయ్యపేటలోని 142 బూత్‌లలో ఓటింగ్‌ మందకోడిగా సాగింది. ఉపముఖ్యమంత్రి, వైసిపి అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు తన స్వగ్రామం తారువలో ఓటు వేశారు. మాజీ ఎంపీపీ కిలపర్తి రాజేశ్వరి భాస్కరరావు దంపతులు దేవరాపల్లిలో ఓటు వేశారు. అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌ దేవరాపల్లిలో జరుగుతున్న ఓటింగ్‌ సరళని పరిశీలించారు. మాజీ జడ్పిటిసి గాలి వరలక్ష్మి, రవికుమార్‌ దంపతులు కూడా ఓటు వేశారు.కె.కోటపాడు : మండలంలోని 62 పోలింగ్‌ స్టేషన్లలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. మండలంలోని గొల్లలపాలెం, గొట్లాం, పిండ్రంగి గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్‌ కాస్తా మందకుడిగా జరిగింది. క్యూలైన్లలో ఉన్న ఓటర్లు అసహనం వ్యక్తం చేశారు. ఉదయం ఏడు గంటలకే మహిళలు యువకులు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లారు. అనకాపల్లి పార్లమెంటు బిజెపి అభ్యర్థి సీఎం రమేష్‌, మాడుగుల తెలుగుదేశం వైసీపీ అభ్యర్థులు బండారు సత్యనారాయణమూర్తి, ఈర్లె అనురాధలు పోలింగ్‌ స్టేషన్లను సందర్శించారు.చోడవరం నియోజకవర్గంలో..చోడవరం : చోడవరం నియోజకవర్గంలో 74.85 శాతం ఓట్లు పోలయ్యాయి. నియోజవర్గంలోని చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో 2,17,484 మంది ఓటర్లు ఉండగా వారిలో 1,62,792 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.గౌరీపట్నంలో టిడిపి, వైసిపి మధ్య ఘర్షణ చోడవరం మండలంలో ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. గవరవరం బూత్‌ నెంబర్‌ 35లో ఈవీఎం రెండు గంటలపాటు మొరాయించింది. గౌరీపట్నంలో టిడిపి వైసిపికి చెందిన కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులు జోక్యంతో ఘర్షణ సద్దుమణిగింది. పోలింగ్‌ ప్రారంభం కాగానే వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం లేకపోవడంతో క్యూ లైన్లలో నిలబడి వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టిడిపి అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌. రాజు చోడవరం కోటవీధిలోనూ, వైసిపి అభ్యర్థి కరణం ధర్మశ్రీ అంబేరిపురం గ్రామంలో కుటుంబ సమేతంగా ఓట్లు వేశారు. బుచ్చయ్యపేట : మండలంలో చెదురు మధురు ఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా జరిగాయి. దిబ్బడి 148వ బూతులో ఈవియం మొరాయించడంతో ఓటింగ్‌ నిలిచిపోయింది. బంగారమెట్ట, కొండంపూడి గ్రామాల్లో చీప్‌ ఏజెంట్‌, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణను వైసిపి కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల రంగ ప్రవేశం చేసి చెదరగొట్టారు. పెందుర్తి నియోజకవర్గంలో..పరవాడ : పరవాడ మండలంలో రెండు, మూడు చోట్ల చెదురు, మధురు సంఘటనలు మినహా మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. ఓటర్లు మండుటెండను సైతం లెక్క చేయకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపారు. సాయంత్రం 6 గంటల వరకు మండలంలో సుమారు 55 శాతం వరకు పోలింగ్‌ నమోదైనట్లు తహశీల్దార్‌ గణపతిరావు తెలిపారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద సాయంత్రం 6 గంటల తర్వాత భారీ సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్‌లో వేచి ఉన్నారు. సబ్బవరం : పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 88వ వార్డు నంగినారపాడు బూత్‌ నెంబర్‌ 64లో పెందుర్తి జనసేన పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్‌ బాబు లైనులో వున్నా ఓటర్లను కలిసి ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. ఆయన వెంట జనసేన జిల్లా సీనియర్‌ నాయకులు బలిరెడ్డి అప్పారావు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందల వెంకట రమణ తదితరులున్నారు.

➡️