పోలీసు కవాతులో కలెక్టర్‌, ఎస్పీప్రశాతంగా ఓటేసి వెళ్లండి..

May 13,2024 00:00

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ఎన్నికల పోలింగ్‌ సజావుగా సాగేందుకు సర్వం సిద్ధం చేశామని పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి, జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌, ఎస్పీ జి.బిందుమాధవ్‌ చెప్పారు. పోలీసు, సిఆర్పిఎఫ్‌, కేంద్ర బలగాలతో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్‌ నుంచి మల్లమ్మ సెంటర్‌ వరకు ఆదివారం పోలీస్‌ కవాతు నిర్వహించారు. కలెక్టర్‌, ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం 19 బెటాలియన్‌ల సిఆర్పిఎఫ్‌ సిబ్బందిని 4000 మందికి పైగా జిల్లాకు కేటాయించారని చెప్పారు. వారిని పోలీస్‌స్టేషన్‌లా విభజించి వివిధ ప్రాంతాలకు పంపినట్లు చెప్పారు. ప్రజలలో భరోసా కలిగించి వారు ఓటు హక్కును స్వేచ్ఛగా సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. గత నెలరోజులుగా పోలీస్‌ సిబ్బంది సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల పరిధిలో ఎన్నికల నియమావళి ఉల్లంఘించకుండా, సజావుగా ఎన్నికలు జరిగేలా సహకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా తీసుకునే కఠిన చర్యలను వివరించారని చెప్పారు. పటిష్ట భద్రత మధ్య పోలింగ్‌ జరుగుతుందని, ప్రజలంతా తమకు సహకరించాలని కోరారు.

➡️