ఘనంగా ఉగాది వేడుకలు

Apr 9,2024 21:07

ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌  : శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది వేడుకలు దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జాయింటు కలెక్టర్‌ ఎస్‌.ఎస్‌.శోభిక జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుకలను ప్రారంభించారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలకు అన్ని విధాలా మేలు జరగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో మక్కువ భ్రమరాంబమల్లిఖార్జున స్వామి దేవాలయ అర్చకులు అరవెళ్లి విజయకుమార్‌ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లాలో విశిష్ట సేవలందించిన 62 ఏళ్లు పైబడి వయస్సు కలిగిన వివిధ దేవాలయాలకు చెందిన తొమ్మిది మంది అర్చకులను జాయింట్‌ కలెక్టర్‌ సత్కరించి, పురస్కారాలు అందించారు. ఉగాది పచ్చడి, ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ జి.కేశవనాయుడు, దిశా డిఎస్‌పి హర్షిత, దేవాదాయశాఖ అధికారి డివివి ప్రసాదరావు, ఎగ్జిక్యూటివ్‌ అదికారులు వివి సూర్యనారాయణ, మురళీకృష్ణ, టి.రమేష్‌, ఎం ప్రసాద్‌, పురస్కారగ్రహీతలు, ప్రజలు హాజరైనారు.

పాలకొండ : ఉగాది పండగ సందర్భంగా మంగళవారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులు బౌరోతు శంకరరావు ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పద్యాల పోటీలో విద్యార్థులు పోటీ పడి ఆకట్టుకున్నారు. గొట్టమంగళాపురం పాఠశాలకు చెందిన కోట్ల అశ్విత, ప్రథమ బహుమతి సాధించగా, స్థానిక ఉన్నత పాఠశాలకు చెందిన పి.స్వప్న, ద్వితీయ, బెజ్జిపురం పాఠశాలకు చెందిన రుచిత, పాలకొండ ఉన్నత పాఠశాలకు చెందిన భువనశ్రీ తృతీయ బహుమతులు సాధించారు. వీరికి ఉపాధ్యాయుడు వావిలపల్లి గోవిందరావు బహుమతులు అందజేశారు. కనపాక చౌదరి నాయుడు, గణేశ్వరరావు, సాహిణి శ్రీనివాసరావు, శ్రీదేవి, సూరన్నాయుడు, భౌరోతు మల్లేశ్వరరావు కవితలను కవి గానం చేశారు.

సీతంపేట : తెలుగు సంవత్సరాది శ్రీక్రోధి నామ సంవత్సరం సందర్భంగా ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో అర్చకులు శ్రీ వేమకోటి సాయి కృష్ణ శర్మ పూజలు నిర్వహిస్తూ పంచాంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది వర్షం, పంటలు, ఆరోగ్యం, నష్టాలు, వ్యాపారాలు ఎలా ఉంటాయన్న అంశంపై పంచాంగం నిర్వహించారు. అంతేకాక కొత్త సంవత్సరం సందర్భంగా రైతులు తెలుగు సాంప్రదాయంతో ఉట్టిపడేలా తెల్లపంచెలు ధరించి కొత్త నాగళ్లతో పొలాల బాట పట్టారు.

➡️