పశువుల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి

May 27,2024 16:46 #Guntur District

ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ప్రమాదవశాత్తు ఆదివారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన పశువుల రైతులకు నష్టపరిహారం అందించాలని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య అన్నారు. సోమవారం ఎంటీఎంసీ పరిధిలోని చిర్రావూరు గ్రామంలో రైతు సంఘం నాయకులతో కలిసి, ప్రమాదం జరిగిన తీరును ఆయన పరిశీలించారు. అనంతరం పశువుల రైతులను కలుసుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం గ్రామంలో జరిగిన బస్సు ప్రమాదం లో నోరులేని పాడి పశువులు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. పాడి సంపదపై జీవనం సాగిస్తున్న రైతులకు తీరని నష్టం జరగడం అన్యాయమని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పశువులపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు పశుపోషణ చేయడం కష్టతరం గా మారిందని అన్నారు. ఒకవైపున వ్యవసాయం గిట్టుబాటు కాక, పాడి నే జీవనాధారం చేసుకొని కొంతమంది రైతులు జీవిస్తున్నారని అన్నారు. అదేవిధంగా తాడేపల్లి మండలంలోని పశువులు అధికంగా ఉన్న చిర్రావూరు గ్రామంలో ఇలాంటి ఘటన జరగటం రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. పాడి పశువులు నష్టపోయిన రైతులకు ఒక్కో గేదకు లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు మాట్లాడుతూ పాడి పశువులు అధికంగా ఉన్న చిర్రావూరు గ్రామంలో గత 15 సంవత్సరాలుగా పశు వైద్యశాలకు వైద్యుణ్ని నియమించలేదని ఆయన అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో పశువులకు వైద్యం అందించేందుకు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుందని, పాడి రైతులు వేల రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ఆవేదన చెందారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగంతో పాటు, పాడి పశువులను కూడా రక్షించుకోవలసిన ఆవశ్యకత రైతులపై ఉందన్నారు. బస్సు పోషణకు కావలసిన మేత(దాణా) పాడి రైతులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి కాజా వెంకటేశ్వరరావు, రైతు సంఘం రాజధాని నాయకులు కొర్రపోలు ఈశ్వరరెడ్డి, రైతు సంఘం తాడేపల్లి మండల నాయకులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, బొప్పన గోపాలరావు, మేడూరి పాములు, సంఘం తాడేపల్లి మండల నాయకులు పల్లపాటి సుబ్బారావు,తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు కళ్ళం రాజశేఖర్ రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ తెలుగు రైతు అధికార ప్రతినిధి అక్కినేని సుబ్రహ్మణ్యం, తెలుగుదేశం చిర్రావూరు గ్రామ అధ్యక్షులు వీరిశెట్టి శ్రీనివాసరావు, వైయస్ఆర్సీపీ రైతు నాయకులు మేకల సాంబశివరావు, టిడిపి గుండిమెడ గ్రామ నాయకులు కాట్రగడ్డ మధు తదితరులు పాల్గొన్నారు.

➡️