హంస వాహనంపైకోదండరాముడు

ప్రజాశక్తి -ఒంటిమిట్టఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం రాత్రి శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు వాహనసేవ ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు నిర్వహించారు. కేరళ వాయిద్యాలు, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారు వేణుగానాలంకారంలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు ఉదయం 7.30 గంటల నుండి స్వామివారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం 11 నుండి ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించనున్నారు.ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఇఒలు నటేష్‌బాబు, ప్రశాంతి, సూపరింటెండెంట్లు హనుమంతయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌ పాల్గొన్నారు.

➡️