ఈదురుగాలులతో భారీ వర్షం

May 9,2024 21:29

 ప్రజాశక్తి-బొబ్బిలి, కొత్తవలస, వేపాడ, మక్కువ, వీరఘట్టం : జిల్లాలోని పలు మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వర్షంతో కాస్తా సేద తీరారు. సాయంత్రం 5గంటల తరువాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షం కురిసింది. బొబ్బిలి : పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలులతో మామిడి కాయలు నేలరాలాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షంతో చెరకు, మొక్కజొన్న, కూరగాయల సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వేపాడ : మండలంలో కుండపోత వర్షం కురిసింది. వర్షంతో చెరువుల్లో నీరు చేరడం కాకుండా పశువుల మేతలకు అనుకూలంగా ఉంటుందని, నువ్వు పంటకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. కొత్తవలస : మండలంలో గురువారం సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలులతో వర్షం మక్కువ మండలంలోని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో మార్కొండ పుట్టి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో అరటిపంటకు నష్టం వాటిల్లింది. చేతికి వచ్చే పంట నేలకొరగడంతో రైతులు లబోదిబో అంటున్నారు.వీరఘట్టం : మండలంలో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కు అల్లాడిపోతున్న తరుణంలో ఒక్కసారి ఆకాశంలో మబ్బులు ఏర్పడి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. దీంతో రహదారిపై వర్షం నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, పాదచారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యారు.చిన్నరాయుడుపేట వద్ద ట్రాఫిక్‌ జామ్‌సీతానగరం : మండలంలోని చిన్నరాయుడుపేట వద్ద గురువారం సాయంత్రం కురిసిన వర్షం గాలుల కారణంగా జాతీయ రహదారిపై చెట్టు అడ్డంగా పడడతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో వెంటనే పోలీసులు కలుగజేసుకొని అడ్డంగా ఉన్న చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

➡️