నెల్లిమర్లలో హోరాహోరీ

May 2,2024 21:40

నెల్లిమర్ల నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి ప్రధాన పార్టీలు వైసిపి, జనసేన, కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడతారో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో వైసిపి నుంచి బడ్డుకొండ అప్పల నాయుడు ఇదే నియోజక వర్గం నుంచి జిల్లాలో అత్యధిక మెజార్టీతో గెలిచారు. ఈ సారి కూడా తాను విజయం సాధిస్తానన్న ధీమాతో ఉన్నారు. పొత్తుల్లో భాగంగా ఈ సారి ఈ టిక్కెట్టును జనసేనకు కేటాయించారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ ఆమె తెలుగు దేశం నాయకులతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నుంచి సరగడ రమేష్‌ కుమార్‌ కూడా బరిలో ఉండి ప్రచారం చేస్తున్నారు.

ప్రజాశక్తి – నెల్లిమర్ల : 2019లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన బడ్డుకొండకు ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో భోగాపురం వైసిపి పటిష్టంగా ఉండి ఆ పార్టీ గెలుపు కోసం నాయకులు కార్యకర్తలు కష్ట పడి పని చేశారు. ప్రస్తుతం అక్కడ స్థానిక వైసిపి నాయకులను అధిష్టానం పట్టించుకోక పోవడంతో చాలా మంది నాయకులు జనసేనలో చేరిపోయారు. కాగా అక్కడే మరో వైసిపి నాయకుని వ్యవహార శైలి నచ్చక ఆ పార్టీలో ఉన్న వారే అతనిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఇది కూడా బడ్డుకొండకు కాస్త తలనొప్పిగానే మారింది. పూస పాటిరేగ, డెంకాడ మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భారీ స్థాయిలో నాయకులు జనసేనలో చేరారు. నియోజక వర్గ కేంద్రమైన నెల్లిమర్ల గత ఎన్నికల్లో వైసిపికి భారీ మెజార్టీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం నాటి పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే నియోజక వర్గానికి ప్రధాన కేంద్రమైన నెల్లిమర్ల, జరజాపుపేటలో వైసిపిని వీడి నగర పంచాయతీ చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌, మరికొంత మంది జనసేనలో చేరారు. దీంతో సుమారు పదివేల ఓట్లు ఉండే ఈ రెండు గ్రామాల్లో వైసిపికి పట్టు తగ్గిందన్న వాదన వినిపిస్తుంది.నెల్లిమర్ల ఎంపిపి అంబళ్ల సుధారాణి కూడా గతంలో పార్టీ నాయకుల వ్యవహారం నచ్చక రాజీనామా వరకూ వెళ్లారు. వైసిపి నెల్లిమర్ల మండల అధ్యక్షుడు కూడా గుర్తింపు లేదని కొన్నాళ్ళు స్తబ్దుగా ఉండటంతో ఆయన్ను తిరిగి బుజ్జగించి ప్రచారంలో తిప్పుకుంటున్నట్లు సమాచారం. వీరితో బాటు మరికొంత మంది ఇప్పటికీ అసంతప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ విజయం అంత సులువు కాదని వైసిపి వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా జనసేన అభ్యర్థి లోకం నాగ మాధవి టిడిపితో కలసి ప్రచారాన్ని ప్రారంభించినా కొన్ని చోట్ల నాయకులు ఆమె వెంట తిరిగేందుకు అంతగా మొగ్గు చూపడం లేదన్న వాదన వినిపిస్తోంది. టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి కర్రోతు బంగార్రాజుకు టికెట్‌ ఇవ్వకుండా ఆమెకు కేటాయిండంపై ఇంకా పార్టీలో కొంత మంది జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిస్తోంది. కానీ రెండు పార్టీల అధినేతలు ఇటీవల డెంకాడ, విజయనగరం వచ్చిన సందర్భాల్లో నాయ కులతో మాట్లాడి మాధవిని ఎలాగైనా గెలిపించుకుని తీసుకు రావాలని ఆదేశించడంతో కర్రోతు బంగార్రాజు దగ్గరుండి ప్రతి ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఆమె గెలుపు కోసం పనిచేస్తున్నట్లు కార్యకర్తలే చెబుతున్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే తప్ప ఇక్కడ లోకం మాధవి విజయం అంత సులువు కాదని అంచనా వేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో 90 శాతం పైగా బిసిలు ఉన్నారు. ఇందులో అధిక శాతం కాపు సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే బడ్డుకొండ తనకే వారంతా ఓటు వేస్తారని భావించి విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండగా, కుల, మతాలతో సంబంధం లేకుండా పవన్‌, చంద్రబాబుపై ఉన్న అభిమానంతో తనకే ఓటు వేస్తారన్న దీమాతో లోకం మాధవి ఉన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇస్తే రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సరగడ రమేష్‌కుమార్‌ ప్రచారం చేస్తున్నారు. అయితే ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

➡️