రోడ్లపై పశువులు సంచరిస్తే గోశాలకు తరలించేస్తాం : ఆరోగ్యశాఖాధికారి హెచ్చరిక

ప్రజాశక్తి – నెల్లూరు : నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో రోడ్లమీద విశృంఖలంగా సంచరిస్తూ, వాహనదారులకు అడ్డంకిగా మారిన పశువులను గోశాలకు తరలించేస్తామని కార్పొరేషన్‌ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ హెచ్చరించారు. మంగళవారం పశువులను గోశాలకు తరలించే స్పెషల్‌ డ్రైవ్‌ లో భాగంగా స్థానిక ఏ.సి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్టు, చాకలి వీధి, మెక్లిన్స్‌ రోడ్‌ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న పశువులను కల్లూరుపల్లి గోశాలకు తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వెంకటరమణ మాట్లాడుతూ … నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పశువులపై వాటి యజమానులు బాధ్యత వహించకపోతే కఠిన చర్యలు తప్పవని, ప్రతిరోజూ స్పెషల్‌ డ్రైవ్‌ లు నిర్వహించి వాటిని గోశాలకు తరలించేస్తామని స్పష్టం చేశారు. ట్రాఫిక్‌ సమస్యల ఉత్పన్నంతో పాటు, వాహన చోదకులు ప్రమాదాలకు గురవడానికి రోడ్లపై సంచరించే పశువులే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయని, అలాంటి చర్యలను అడ్డుకోవడానికి తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ స్పష్టం చేశారు.
పశువులను గోశాలకు తరలించి వాటి సంరక్షణ బాధ్యతలను నగరపాలక సంస్థ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తుందని తెలిపారు. పశువులను యజమానులు వాళ్ల ప్రాంగణాలలోనే ఉంచుకోవాలని, పాదచారులను భయబ్రాంతులకు గురి చేస్తూ రోడ్లపై సంచరించే పశువులను గోశాలకు తరలిస్తామని డాక్టర్‌ హెచ్చరించారు. పశువులను కట్టడి చేసుకోవాలని యజమానులకు గతంలోనే హెచ్చరిక నోటీసులు జారీ చేసి ఉన్నామని, మీడియా మాధ్యమాల ద్వారా విస్తఅతంగా ప్రచారం కల్పిస్తున్నామని, ఇప్పటినుంచైనా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పశువుల యజమానులకు డాక్టర్‌ తెలిపారు. అనంతరం డివిజన్‌ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా జరుగుతున్న డ్రైను కాలువల్లో పూడికతీత పనులను డాక్టర్‌ పర్యవేక్షించారు.

➡️