ఉత్తుత్తిగా నిధుల విడుదల

Apr 10,2024 00:20

లబ్ధిదార్లకు మెగా చెక్కును అందిస్తున్న గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి (ఫైల్‌)
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఒకటో తేదీ నుంచి విడుదల చేసిన మూడు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల కాక మహిళలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. తిరిగి తిరిగి విసిగి వేసారి ఎన్నికలు రావడం వల్ల ఇక నిధుల రావని అధికారులు తాపీగా చెబుతుండంతో తీవ్ర నిరాశతో ఇంటిముఖం పడుతున్నారు. నవరత్నాలలో భాగంగా సిఎం జగన్‌ మార్చి ఒకటిన పామర్రులో జగనన్న విద్యా దీవెన నిధులను బటన్‌ నొక్కి విద్యార్థి, తల్లి ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లాలో 37,064 మందికి రూ.31.28 కోట్లు విడుదల చేసినట్టు అధికారులు అదేరోజు ఃచెక్కులు విడుదల చేశారు. కానీ ఇంత వరకు నిధులు రాలేదు. దీంతో విద్యా దీవెన ద్వారా సొమ్ము రాకపోవడంతో విద్యార్థులను ఆయా విద్యా సంస్థల నిర్వహాకులు ఫీజు చెల్లించాలని వత్తిడి చేస్తున్నారు. విద్యార్థి, అతని తల్లితో ఇటీవల జాయింట్‌ ఖాతాను ప్రారంభింప చేసిన ప్రభుత్వం అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక నిధులను పలు మార్లు వాయిదా వేసి మార్చి ఒకటిన విడుదల చేశారు. కానీ జిల్లాలో సగం మందికి పైగా నిధుల రాకపోవడంతో తల్లిదండ్రులు అప్పోసొప్పో చేసి కళాశాలల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజులుకట్టని వారిని విద్యార్థులను ఇళ్లకు పంపుతుండటంతో అనివార్యంగా అప్పులు చేసి అయనా ఫీజులు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.చేయూత కోసం ఎదురుచూపులుఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు చెందిన 45-60 ఏళ్ల లోపు మహిళలకు స్వయం ఉపాధి కోసం ఏటా రూ.18,750 ఇస్తామన్న ప్రభుత్వం నాలుగో ఏడాది చాలా ఆలస్యంగానే నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అనకాపల్లి జిల్లా పిసినికాడలో సిఎం జగన్‌ వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను మార్చి 7న విడుదల చేశారు. కానీ జిల్లాలో 30 శాతం మందికి కూడా నిధులు రాలేదు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు చెందిన 93,275 మందికి రూ.18,750 చొప్పున నిధులు రూ.174.88 కోట్లు విడుదల చేశారని అధికారులు ప్రకటించారు. దాదాపు నెల పాటు బ్యాంకుల చుట్టూ తిరిగిన సంబంధిత మహిళలు చివరికి ఎన్నికల కోడ్‌ వచ్చినందున ఇక రానేట్టేనని అధికారులు సమాధానం చెబుతుండటంతో వారు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. తొలుత జూన్‌లో విడుదల చేసిన నిధులు నాలుగు ఏళ్లలో దశలవారీగా కాలయాపన చేస్తూ చివరికి మార్చి 7న విడుదల చేసినట్టు బటన్‌ నొక్కినా మహిళల ఖాతాల్లో జమ కాలేదని చెబుతున్నారు. ఒసి మహిళలకు తప్పని నిరాశఓసీ సామాజిక తరగతికి చెందిన 45-60 ఏళ్ల మహిళలకు మూడేళ్ల పాటు ఏటా రూ.15 వేలు చొప్పున అందించే పథకం ఈబీసీ నేస్తం. ఈ పథకం ద్వారా రెండేళ్ల పాటు రూ.15 వేలు చొప్పున జిల్లాలో దాదాపు 20 వేల మంది మహిళలకు అవకాశం దక్కింది. ఏటా డిసెంబరులోగానే ఇచ్చే ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి 14న ఎన్నికల కోడ్‌కు రెండు రోజులముందు కర్నూలు జిల్లా బనగానపల్లె నుంచి సిఎం జగన్‌ బటన్‌నొక్కి నిధులు విడుదల చేశారు. జిల్లాలో 21,687 మంది మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా రూ.32.53 కోట్లు నిధులు విడుదల చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కానీ ఇంత వరకు నిధులు మహిళల ఖాతాల్లో జమకాలేదు. 16వ తేదీన ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఇక ఈసొమ్మురానట్టేనని లబ్ధిధారులు నిట్టూరుస్తున్నారు.

➡️