ఆకట్టుకున్న పోలీసు మాక్‌డ్రిల్‌

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: కౌంటింగ్‌ రోజున శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు, ఆర్మ్‌డ్‌ రిజర్వు కేంద్ర పోలీసు బలగాలు తీసుకునే చర్యలపై యర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్‌ బొమ్మ సెంటర్‌లో గురువారం నిర్వహించిన మాబ్‌ ఆపరేషన్‌ మాక్‌ డ్రిల్‌ విశేషంగా ఆకట్టుకుంది. ఎస్పీ గరుడ సుమిత్‌ సునీల్‌ ఆదేశాలతో డిఎస్పీ బాల సుందర్‌రావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు ఎలా స్పందిస్తారో ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. హింసాత్మక సంఘటన జరిగితే గుంపును నియంత్రించేందుకు చేసే హెచ్చరికలను ప్రయోగాత్మకంగా చూపించారు. హెచ్చరిక వినకపోతే వారు మెజిస్ట్రేట్‌ అనుమతితో భాష్పవాయు ప్రయోగం, తమను తాము రక్షించుకోవటానికి లాఠీఛార్జీ, ఆపై వాటర్‌ క్యానన్‌ వినియోగం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రదర్శించారు. మాక్‌ డ్రిల్‌లో పాల్గొన్న పోలీసులు ఆద్యంతం రక్తి కట్టించడంతో చూసిన ప్రజలు మంత్రముగ్ధుయ్యారు. తొలుత అక్కడ నిజంగానే యుద్ధ వాతావరణం నెలకొందని కొందరు పరుగులు తీశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వారంతా మఫ్టీలో ఉన్న పోలీసులేనని ఆసక్తిగా గమనించారు. ఈ సందర్భంగా మార్కాపురం డిఎస్పీ బాల సుందరరావు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా మాక్‌డ్రిల్‌ నిర్వహించామని తెలిపారు. కౌంటింగ్‌ సందర్భంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే నియంత్రించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామని తెలిపారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం సీఐ రాములు నాయక్‌, ఎస్‌ఐ సుదర్శన్‌తో పాటు నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గిద్దలూరు: ఏపీలో జూన్‌ 4న ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్ధమవుతున్న తరుణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గిద్దలూరు పట్టణంలోని వైఎస్సార్‌ సర్కిల్‌లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఈ మాక్‌ డ్రిల్‌ లోని కసరత్తులు, వాస్తవ సంఘర్షణలను పోలిఉండేలా వాస్తవికంగా కళ్లకు కట్టినట్లు పోలీసులు చూపించారు. ఎన్నికల ఫలితాల రోజు, ఆ తర్వాత ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమని పెద్దఎత్తున విమర్శలు వస్తున్న తరుణంలో అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మాక్‌ డ్రిల్‌లో ఎఎస్పీ అశోక్‌బాబు, గిద్దలూరు ఎస్‌ఐ వెంకటేశ్వరరావు, పోలీసు అదనపు బలగాలు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.

➡️