నిర్వహణ కొరవడి.. సమస్యల ఒరవడి..!

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ జిల్లాలో కీలకమైన రాజంపేట ఆర్‌టిసి బసాండ్‌ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రయాణికులకు అగచాట్లు తప్పడం లేదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా పార్లమెంట్‌తో పాటు రెవెన్యూ డివిజన్‌ కేంద్రం రాజంపేట. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఆర్‌టిసి బస్టాండ్‌లోని సమస్యల గురించి అధికారులు పట్టించుకున్న పాపానపోవడం లేదు. కార్మికులు, ప్రయాణికులు, ఆర్‌టిసి సిబ్బంది కోసం లక్షలు వెచ్చించి నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసినా కొన్ని నెలలుగా వాటర్‌ ప్లాంట్‌లో శీతలీకరణ యంత్రం చెడిపోయింది. వేసవిలో చల్లని నీరు అందుబాటులో లేక వాటర్‌ ప్లాంట్‌ నిరుపయోగంగా ఉంటూ కనీసం ప్రయాణికులు, ఆర్‌టిసి సిబ్బందికి మంచినీటిని కూడా అందించలేని దుస్థితిలో రాజంపేట ఆర్‌టిసి బస్టాండ్‌ ఉంటోంది. శాశ్వత పరిష్కారంగా శీతల నీటి శుద్ధి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురాలేక దాతల సహకారంతో వాటర్‌ ఫిల్టర్‌ ఏర్పాటు చేశారు. అందులో కూడా ఒక రోజు నీరుంటే వారం రోజులు నీరు లేక ప్రయాణికులతో పాటు ఆర్‌టిసి సిబ్బంది మంచినీటి కోసం నానా అగచాట్లు పడుతున్నారు. వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం లేక ద్విచక్ర వాహనదారులు బస్టాండ్‌ ఆవరణలోనే అడ్డదిడ్డంగా వాహనాలు పార్కింగ్‌ చేస్తున్నారు. బస్టాండ్‌ ఆవరణలో కావలసినంత స్థలం ఉన్నా పార్కింగ్‌ ఏర్పాటు చేసి ఆర్‌టిసి సంస్థకు ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్‌టిసి సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి గహాలు మందుబాబులకు, అసాంఘిక కార్యకలపాలకు అడ్డాగా మారి చెత్తాచెదారం, కంప చెట్లుతో మురుగునీరు చేరి ఆర్‌టిసి క్వార్టర్లు వద్ద మడుగును తలపిస్తున్నాయి. రాత్రి వేళల్లో మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాగా మారి అసాంఘిక కార్యక్రమాలు నిత్యకత్యమయ్యాయి. ఇప్పటికైనా ఆర్‌టిసి ఉన్నతాధికారులు చొరవ తీసుకుని రాజంపేట బస్టాండ్‌లో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించి సిబ్బందికి, ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమస్యలపై ఆర్‌టిసి డిపో మేనేజర్‌ రమణయ్యను వివరణ కోసం చరవాణి ద్వారా ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

➡️