ఇండియా వేదిక, సిపిఎం ప్రణాళికలతోనే దేశాభివృద్ధి

Apr 29,2024 23:32

మాట్లాడుతున్న సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజరుకుమార్‌, వేదికపై కాంగ్రెస్‌ అభ్యర్థి చుక్కా చంద్రపాల్‌
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
ఇండియా వేదిక, సిపిఎం ప్రణాళికలతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయకుమార్‌ అన్నారు. స్థానిక పుతుంబాక భవన్‌లో జరిగిన సిపిఎం సత్తెనపల్లి నియోజకవర్గం విస్తృత సమావేశం జిల్లా కమిటీ సభ్యులు జి.బాలకృష్ణ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. విజరు కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి ద్రోహం చేసిన మతోన్మాద బిజెపిని, దానితో జతకట్టిన టిడిపి, జనసేనను ఓడించాలని, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని, ధరలను నియంత్రించాలని, పంటలకు మద్దతు ధర చట్టం చేయాలని, లేబర్‌ కోడ్‌లను రద్దు కేయాలని, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టాన్ని నిలిపేయాలని కోరారు. ఇసుక, గనులు ప్రభుత్వ భూముల కేటాయింపుల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని, నిర్మాణ వ్యయం రూ.ఆరు లక్షలకు పెంచాలని కోరారు. అటవీ హక్కుల చట్టం 1/ 70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ రంగ పరిరక్షణ, సహకార రంగం పటిష్టత చేయాలని అన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచకూడదని, ట్రూ అప్‌ చార్జీలు రద్దుచేయాలి, మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలపై అత్యాచారాలు, దాడులు అరికట్టాలన్నారు. మద్యపానం పై నియంత్రణ చేయాలి, ప్రజాస్వామిక హక్కులు పరిరక్షించాలని అన్నారు. ఈ అంశాలు తమ మేనిఫెస్టోలో పొందుపర్చినట్లు వివరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యులు గద్దె చలమయ్య మాట్లాడుతూ ఇండియా వేదిక కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తుందని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మబోదని, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు ఇస్తుందని చెప్పారు. రూ.2 లక్షల రైతుల రుణాలను మాఫీ చేస్తుందని, రుణ విముక్తి కమిషన్‌ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. పేద మహిళలకు సంవత్సరానికి రూ.లక్ష ఇస్తుందని అన్నారు. బిజెపి రద్దు చేసిన కార్మిక చట్టాలను అన్నింటిని పునరుద్ధరిస్తుందని అన్నారు. సంవత్సరానికి 30 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను భర్తీ చేస్తుందని, అందులో మహిళలకు 50 శాతం రిజర్వ్‌ చేస్తుందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తుందనిన్నారు. వ్యవసాయ పనిముట్లపై జిఎస్టిని ఎత్తివేస్తుందని అన్నారు. ఇండియా వేదిక తరుపున సత్తెనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చుక్కా చంద్రపాల్‌ మాట్లాడుతూ అందరం సమన్వయంతో పని చేసి మంచి ఫలితాలు సాధిద్దామన్నారు. సమావేశంలో సిపిఎం నాయకులు కె.శివదుర్గారావు, ఎ.వీరబ్రహ్మం, పి.మహేష్‌, ఆర్‌.పూర్ణచంద్రరావు, జి.పిచ్చారావు, మేరమ్మ, షేక్‌ మస్తాన్‌వలి, జి.రజని, కె.సాంబశివరావు, కె.నాగేశ్వరరావు, పి.ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కె.ఆనందరావు, జె.శేఖర్‌, షేక్‌ రెడ్డిగూడెం ఆరీఫ్‌, అంజయ్య, గౌతం, విజరు పాల్గొన్నారు.

➡️