రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ‘ఇండియా’ అభ్యర్థులను గెలిపించాలి

మంగళగిరి: భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘ఇండియా’ వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని నాయకులు ఉద్ఘాటించారు. ఇండియా వేదిక తరుపున మంగళగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్న శివశంకరరావు శనివారం కాంగ్రెస్‌ పట్టణ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ నాయకులను కలిశారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు కె.జీవన్‌ సాగర్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన బిజెపితో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు చేతులు కలిపాయని విమర్శించారు. వైసిపికి, టిడిపికి ఓటు వేస్తే బిజెపికి వేసినట్లేనని అన్నారు. రాష్ట్ర, దేశ ప్రయోజనాలు దష్ట్యా రానున్న ఎన్నికల్లో ఇండియా వేదిక అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. జొన్న శివశంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్పొరేషన్లో పన్నులు అధికంగా వేశారని విమర్శించారు. 20 వేల మంది వివిధ రకాల భూముల్లో పేదలు ఇల్లు వేసుకుని నివసిస్తున్న వారికి అక్కడే నివాస ఉంటున్న వారికి ఇంటి పట్టాలు రావాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. అనంతరం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని బిజెపి ధ్వంసం చేస్తోందని, బిజెపి నుండి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అంరదిపైనా ఉందని చెప్పారు. జొన్న శివశంకరరావుతోపాటు గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జంగాల అజరు కుమార్‌, గుంటూరు జిల్లాలో వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు, పి.బాలకృష్ణ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ఎస్‌ చెంగయ్య, పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, సిపిఐ నియోజవర్గ కార్యదర్శి చిన్నితిరపతయ్య, నాయకులు జె.జానుబాబు, వై.వెంకటేశ్వరరావు, కె.కాశయ్య, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జి.సాంబశివరావు, కె.రాధిక, ఇ.శివాజీ, బి.సమర్పణ కుమార్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కె.రామారావు పాల్గొన్నారు. మంగళగిరి రూరల్‌ : నిడమర్రులో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కుర్రా పున్నారావును జొన్న శివశంకర్‌రావు, సిపిఎం నాయకులు శనివారం కలిశారు. మంగళగిరి ఎమ్మెల్యేగా ఇండియా బ్లాక్‌ అభ్యర్థి శివశంకర్‌రావు గెలుపునకు కృషి చేస్తామని ఈ సందర్భంగా పున్నారావు చెప్పారు. గ్రామంలో ఇతర పెద్దలను కలసి ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించాలని శివశంకరరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న బిజెపిని, దాని మిత్రులను ఓడించాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. బిజెపి కూటమి అబద్ధాలు, అవకాశవాద రాజకీయాలతో పబ్బం గడుపుకునేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. భారత రాజ్యాంగానికి బిజెపి తూట్లు పొడుస్తోందని, మనువాద రాజ్యాంగ అమలుకు యత్నిస్తోందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజలపై భారాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాలు అమలు చేయకుండా, రాజధానికి ఒక రూపాయి కూడా ఇవ్వకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన బిజెపికి, తగిన గుణపాఠం చెప్పే అవకాశం ప్రజలకు ఇప్పుడు ఎన్నికల ద్వారా వచ్చిందని అన్నారు. బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మెదిపేందుకు భయపడుతున్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో వామపక్షాలు, కాంగ్రెస్‌ ఇతర లౌకిక పార్టీలకు ఓట్లేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్‌ కార్యదర్శి ఎం.రవి, నాయకులు ఎం.భాగ్యరాజు, కె.వెంకటేశ్వర్లు, జి.నాగేశ్వరరావు, ఎం.ప్రసన్నకుమార్‌, కె.నాగేశ్వరరావు కె.నానయ్య, సురేష్‌, ఎం.రాజముని, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. తాడేపల్లి: రాజ్యాంగ వ్యవస్థలు పరిరక్షింపబడాలంటే ఇండియా వేదిక అభ్యర్థులకే ఓట్లు వేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య ప్రజలను కోరారు. స్థానిక మేకా అమరారెడ్డి భవన్‌లో నిర్వహించిన సిపిఎం విస్తృత సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇండియా వేదిక నుండి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి జొన్నా శివశంకరరావు, గుంటూరు ఎంపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిపిఐ జంగాల అజరుకుమార్‌లకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల కాలంలో సిబిఐ, ఈడి లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నీరు గార్చారని అన్నారు. తన రాజకీయ స్వార్ధం కోసం ప్రతిపక్ష పార్టీల నేతలను అక్రమంగా అరెస్టు చేయించి జైలుకు పంపిస్తున్నారని మండిపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని హెచ్చరించారు. అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మోడీ దగ్గర దాసోహం అయ్యాయని ఎద్దేవా చేశారు. ఆ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సూర్యారావు, పట్టణ కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు, డి.శ్రీనివాసకుమారి, వి.దుర్గారావు పాల్గొన్నారు. శనివారం రాత్రి సుందరయ్యనగర్‌లో జరిగిన జనరల్‌ బాడీ సమావేశాలు నిర్వహించారు. సిపిఎం నాయకులు కె.కరుణాకరరావు మాట్లాడారు. ఎస్‌కె బాష, కొండబాబు పాల్గొన్నారు.

➡️