నువ్వా – నేనా అన్నట్లు కన్నా – అంబటి పోటీ

May 6,2024 00:44

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ : సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి, వైసిపి మధ్య పోటీ నువ్వా నున్నా అన్నట్టుగా జరుగుతోంది. వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు, ఎన్‌డిఎ కూటమి తరుపున టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మధ్య ముఖాముఖి పోటీ జరుగుతోంది. ఇద్దరూ ఒకే సామాజిక తరగతికి చెందిన వారు కావడంతో ఓట్ల చీలిక ప్రభావం అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ధేశించనున్నాయి. ఇండియా బ్లాక్‌ తరుఫున కాంగ్రెస్‌ పార్టీ నుంచి చుక్కా చంద్రపాల్‌ పోటీ చేస్తున్నారు. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గత ఎన్నికలో 20 వేల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన రాంబాబు ఈసారి లకీëనారాయణ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. జనసేన నుంచి పోటీచేస్తారని భావించి చివరికి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావించిన బొర్రా అప్పారావు పోటీ నుండి వైదొలిగి టిడిపి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు మద్దతు ప్రకటించారు. టిడిపి టిక్కెట్‌ ఆశించి అసమ్మతి నాయకుడిగా ముద్ర పడిన డాక్టర్‌ కోడెల శివరాం ప్రస్తుతం టిడిపి విజయానికి కృషి చేస్తున్నారు.సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు జరిగిన 13 సార్లు సార్వత్రిక ఎన్నికలు జరగగా ఐదుసార్లు కాంగ్రెస్‌ పార్టీ, మూడుసార్లు టిడిపి, రెండుసార్లు సిపిఎం, ఒకసారి సిపిఐ, ఒక్కసారి వైసిపి, రెండుసార్లు ఇండిపెండెంట్లు గెలుపొందారు. 1955లో సత్తెనపల్లి నియోజకవర్గం ఏర్పడింది. 1955లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి వావిలాల గోపాలకృష్ణయ్య కాంగ్రెస్‌పార్టీకి చెందిన బండారు వందనంపై 875 ఓట్ల మోజార్టీతో గెలుపొందారు. 1962లో కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన ఇండిపెండెంట్‌ అభ్యర్ధి వావిలాల గోపాలకృష్ణయ్య తిరిగి రెండవసారి పోటీచేసి కాంగ్రెస్‌పార్టీకి చెందిన మేడూరి నాగేశ్వరరావుపై 4,685 ఓట్ల మెజార్టీతో తిరిగి గెలుపొందారు. 1967లో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా మూడోసారి బరిలోకి దిగిన వావిలాల గోపాలకృష్ణయ్య కాంగ్రెస్‌పార్టీకి చెందిన మానిఫోనియాపై 2443 ఓట్ల మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్‌ సాధించారు. నాల్గవసారి 1972లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి గాదె వీరాంజనేయ శర్మ చేతిలో 809 ఓట్లతో ఓటమిపాలయ్యారు. 1978లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థి పుతుంభాక వెంకటపతి కాంగ్రెస్‌పార్టీకి చెందిన రావెల వెంకట్రావు చేతిలో 9,369 ఓట్లతో ఓడిపోయారు. 1983లో టిడిపి స్థాపించిన తర్వాత ఆ పార్టీ తరుపున నన్నపనేని రాజకుమారి, కాంగ్రెస్‌పార్టీకి చెందిన చేబ్రోలు హనుమయ్య మధ్య జరిగిన పోటీలో 19,668 ఓట్లతో రాజకుమారి గెలుపొందారు. 1985లో జరిగిన ఎన్నికల్లో సిపిఎం అభ్యర్ధి పుతుంభాక వెంకటపతి కాంగ్రెస్‌పార్టీకి చెందిన జెవి పద్మలతపై 9,351 ఓట్లతో గెలుపొందారు. 1989లో తిరిగి సిపిఎం అభ్యర్ధిగా ఎన్నికల బరిలో దిగిన పుతుంభాక వెంకటపతి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దొడ్డా బాలకోటిరెడ్డి చేతిలో 13,928 ఓట్లతో ఓటమిపాలయ్యారు. 1994లో పుతుంభాక వెంకటపతి భార్య పుతుంభాక భారతి కాంగ్రెస్‌పార్టీకి చెందిన రాయపాటి శ్రీనివాసరావుపై 2,337 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. 1999లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి వైవి ఆంజనేయులు కాంగ్రెస్‌పార్టీకి చెందిన చేబ్రోలు హనుమయ్యపై 10,693ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో యర్రం వెంకటేశ్వరరెడ్డి సమీప తెలుగుదేశంపార్టీ అభ్యర్థి కళ్లం అంజిరెడ్డిపై 24,410 ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 2009కు ముందు సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి, మేడికొండూరు, ఫిరంగిపురం, ముప్పాళ్ల మండలాలు ఉండేవి. 2009లో నియోజకవర్గాల పునర్‌విభజన నేపథ్యంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో అప్పటివరకు ఉన్న మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలను తాడికొండ నియోజకవర్గంలో కలిపారు. పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న రాజుపాలెం మండలాన్ని, నకరికల్లు మండలాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో కలిపారు. 2009లో సత్తెనపల్లి, ముప్పాళ్ల, నకరికల్లు, రాజుపాలెం మండలాలతో నియోజకవర్గం ఏర్పడింది. 2009లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా రెండవసారి యర్రం వెంకటేశ్వరరెడ్డి బరిలో నిలిచారు. టిడిపి అభ్యర్థి నిమ్మకాయల రాజనారాయణ, ప్రజారాజ్యంపార్టీ అభ్యర్థి భైరా దిల్లీఫ్‌ చక్రవర్తి మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. ఈఎన్నికలలో యర్రం వెంకటేశ్వరరెడ్డి 7,145 ఓట్ల మెజార్టీతో తిరిగి రెండవసారి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు, వైసిపి అభ్యర్ధి అంబటి రాంబాబు తలపడగా 924 ఓట్ల మెజార్టీతో కోడెల శివప్రసాదరావు గెలుపొందారు. మరలా 2019 ఎన్నికల్లోనూ వీరిద్దరే తలపడగా అంబటి రాంబాబుకు 20,876 ఓట్ల ఆధిక్యత లభించింది. ప్రస్తుతం రాంబాబు మూడోసారి ఇదే స్థానం నుండి పోటీ చేస్తున్నారు.

➡️