బకాయిల కోసం పోరు తీవ్రం చేస్తాం : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల కోసం పోరు తీవ్రతరం చేస్తామని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో రిలే దీక్షలను ప్రారంభించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసులురెడ్డి దీక్షలో కూర్చున్న వారికి పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యా యుల పక్షపాతిగా ఉంటామని, ఉద్యోగుల అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌ ఈ ఐదేళ్ల కాలంలో ఉద్యోగులకు చేసిందేమీ లేదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగులను వేధించడమే లక్ష్యంగా పాలన సాగిస్తోందని ఆరోపించారు. మెరుగైన వేతనాలను అమలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో కోత విధించి చరిత్రకెక్కిందన్నారు. అధికారంలోకొచ్చిన వారంలోపే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాట తప్పి, సిపిఎస్‌ స్థానంలో పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయకుండా దుర్మార్గపూరితమైన జిపిఎస్‌ విధానాన్ని ప్రవేశపెట్టాడని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేశారని తెలిపారు. యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయ కుమార్‌, పాలెం మహేష్‌ బాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ అవసరాల కోసం దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌, ఎపిజిఎల్‌ఐ సొమ్ములను ఉద్యోగులకు తెలియకుండానే ప్రభుత్వం తమ అవసరాలకు మళ్లించుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ము పట్ల దోపిడీదారులకంటే హీనంగా ఈ ప్రభుత్వం వ్యవహరించిందని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థిక బకాయిల కోసం పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తోందని చెప్పారు. బకాయిల కోసం ఉద్యమించిన యుటిఎఫ్‌ నాయకులను అరెస్టులు చేయించడం, నిర్బంధించడం, కేసులు పెట్టడం లాంటి చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతోందని వాపోయారు. గత సంవత్సరం జూలై నుంచి 12వ పిఆర్‌సిని అమలు చేయాల్సి ఉండగా, కేవలం కమిటీని నియమించి చేతులు దులుపుకుందే తప్ప, విధి విధానాలు రూపొందించి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు రిలే దీక్షలను కొనసా గిస్తామని, ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల బకాయిలను చెల్లించకపోతే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షలలో యుటిఎఫ్‌ జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్‌, డి.సుజాత రాణి, ట్రెజరర్‌ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు కె.చెన్నయ్య, డి.వి.రవీంద్రుడు, ఎస్‌.ఎజాజ్‌ అహ్మద్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ఎం.ప్రభాకర్‌, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు డి.రూతు ఆరోగ్య మేరీ, నాయకులు ఎం.ఎ.వి.రమణయ్య, కె.గంగన్న ఎన్‌.జహంగీర్‌బాషా ఎం.రామకష్ణ, శివరామకష్ణరాజు కూర్చొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.సునీల్‌ కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మనోజ్‌, రాష్ట్ర నాయకులు సగిలి రాజేంద్రప్రసాద్‌, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి డి.ఎం.ఓబులేసు దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలకు మద్దతు తెలియజేశారు.

➡️