జగన్ మాటలు పచ్చి అబద్ధాలు : తులసిరెడ్డి

Feb 19,2024 15:38 #Kadapa
Jagan's words are raw lies

ప్రజాశక్తి – వేంపల్లె : రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో 99 శాతం హమీలను నేర వేర్చినట్లు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. సోమవారం వేంపల్లెలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా మేనిఫెస్టోలో పేరోన్న హమీలను 99 శాతం అమలు చేశానని చెప్పడం శోచనీయం అన్నారు. సిఎం జగన్ రెడ్డి అబద్ధాలు కవల పిల్లలు లాంటివి అన్నారు. ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా పెట్టుబడి సాయం కింద రూ.12.500 ఇస్తానని మేనిఫెస్టోలో పేర్కొని అందులో రూ.5 వేలు కోత కోవడం జరిగిందని చెప్పారు. అలాగే వైకాపా పాలనలో ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీ గా మారిందని ఎద్దేవా చేశారు. పీజీ విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన అమలు కావడం లేదని అన్నారు. పేదలకు 25 లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి 25 వేల ఇళ్లు కూడా నిర్మించ లేదని విమర్శించారు. జలయజ్ఞం కింద ఒక ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. అలాగే ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడ అమలు కాలేదని తెలిపారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో ఒకటి కూడా నెరవేరలేదని తెలిపారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని మహిళలకు చెప్పిన హామీ అమలు చేయలేదని తెలిపారు. కరెంటు చార్జీలు 8 సార్లు పెంచిన ఘనత కూడ జగన్ కే దక్కుతుందని తులసిరెడ్డి అన్నారు. పొరుగు రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజల్ ధరలు తగ్గిస్తామని చెప్పి పెంచారని తెలిపారు. 2019 ఎన్నికల అఫడవిట్ ప్రకారం దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో అత్యంత ధనవంతుడు జగన్ రెడ్డి అన్నారు. ఇప్పటి జగన్ రెడ్డి ఆస్థివిలువ రూ. 510 కోట్లు అని కాని పేదవాడినని జగన్ చెప్పుకోవడం విడ్డూరం అన్నారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో పెత్తందారులకు, పేదలకు మధ్య పోరాటమని సిద్ధం సభలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి వాటిని పట్టించుకోలేదని విమర్శించారు. ఉద్యోగులకు ఇచ్చిన హమీలను ఒక్కటి అమలు చేయలేదని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించి ఉద్యోగాల విప్లవం తెస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేయడం జరిగిందని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ కూడ నేర వేర్చలేదని చెప్పారు. ఇకనైనా సిఎం జగన్ పచ్చి అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.

ఫోటో గ్రాఫర్ పై దాడి చేయడం అమానుషం

రాప్తాడు బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటో గ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. ఫోటో గ్రాఫర్ పై దాడి చేసిన నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నట్లు తులసిరెడ్డి చెప్పారు. జగన్ పాలన అరాచక పాలన అనేటందుకు ఇది నిదర్శనం అన్నారు.

➡️