అంగన్‌వాడీల పోరాటం స్ఫూర్తిదాయకం

Feb 8,2024 23:00
తమ హక్కుల సాధన కోసం

ప్రజాశక్తి – కరప

తమ హక్కుల సాధన కోసం అంగన్‌వాడీలు చేసిన 42 రోజుల పోరాటం కార్మిక లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిందని అంగన్‌ వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి అన్నారు. స్థానిక తహశీ ల్దార్‌ కార్యాలయం వద్ద కాకినాడ రూరల్‌ సెక్టర్‌ అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు పి.వీరవేణి, వరలక్ష్మి అధ్యక్షతన విజయోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీల వెనుక వేరే శక్తులు ఉన్నాయని తప్పుడు ప్రచారం జరుగుతుందని, అయితే అంగన్‌వాడీల వెనుక ఎర్రజెండా, సిఐటియు మాత్రమే ఉందని గుర్తుం చుకోవాలన్నారు. 42 రోజుల అంగన్‌వాడీల పోరా టం అనేక అనుభవాలను తెచ్చిపెట్టిందన్నారు. రాత పూర్వకంగా వేతనాలు పెంచుతామని రాష్ట్ర మంత్రులు, అధికారులు సంతకాలతో హామీ పత్రం తీసుకోవడం ద్వారా విజయం సాధించామని అన్నారు. సిపిఎం జిల్లా కన్వీనర్‌ మోతా రాజశేఖర్‌ మాట్లాడుతూ మన ఉద్యమ పోరాటాన్ని మరింతగా బలోపేతం చేసేందుకు రాబోయే రోజుల్లో స్థానిక ప్రజా సమస్యలపై పోరాడి బలాన్ని పెంచుకోవాలని అన్నారు. న్యాయమైన సమస్యల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుందని జిల్లా అంగన్‌వాడీ యూనియన్‌ కార్యదర్శి ఇ.చంద్రావతి అన్నారు. 42 రోజులు ఉద్యమ పోరాటంలో ఉన్న ఆ రోజులకు వేతనం ఇవ్వడం అనేది గొప్ప విజయం అని ఐద్వా నాయకురాలు సిహెచ్‌. రమణి అన్నారు. తొలుత ఉద్యమానికి అండగా నిలిచిన పిడిఎఫ్‌ ఎంఎల్‌సి షేక్‌ సాబ్జి మృతికి నివాళులర్పించారు. అనంతరం విజయోత్సవ కేక్‌ను కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సెక్టార్‌ నాయకురాలు దైవకుమారి, అచ్చారత్నం, ఎం.భవాని, కాకినాడ ప్రాజెక్ట్‌ కార్యదర్శి వీరమణీ, లక్ష్మి, రాజేశ్వరి పాల్గొన్నారు.

➡️