అభ్యర్థనలను నిశితంగా పరిశీలించాలి: కలెక్టర్‌

Feb 6,2024 23:05
ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యర్థనలను,

ప్రజాశక్తి – కాకినాడ

ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యర్థనలను, అభ్యంతరాలను నిశితంగా పరిశీలించాలని కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ సివి.ప్రవీణ్‌ఆదిత్య, వివిధ నియోజకవర్గాల ఇఆర్‌ఒలతో కలిసి ఓటర్ల జాబితాపై సమీక్షించారు. ఫాం 6, 7, 8 దరఖాస్తుల పరిష్కారం, తుది ఓటర్ల జాబితాలోని సమస్యలు, మార్పులు చేర్పులు, 18-19 ఓటర్ల వివరాలు, పోలింగ్‌ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాలు, ఇఒఎంలు, వివిపాడ్స్‌ స్ట్రాంగ్‌ రూమ్‌, కౌంటింగ్‌ కేంద్రాలు, సెక్టోరియల్‌ సిబ్బంది నియామకం, శిక్షణ, మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు, ఖాళీల భర్తీ వివరాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఇఆర్‌ఒలు అప్రమత్తతో విధులు నిర్వర్తించాలన్నారు. తప్పనిసరిగా ఎన్నికల కమిషన్‌ నిబంధనలు అమలు చేయాలన్నారు. జనవరి 22న ముద్రించిన తుది ఓటర్ల జాబితాపై వచ్చిన అభ్యంతరాలు మార్పులు, చేర్పులు, బదలాయింపు వంటి అంశాలకు సంబంధించిన ఫారం 6, 7, 8లను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పరిష్కరించాలన్నారు. ఓటరు జాబితాలో ఫోటోలు సక్రమంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 18-19 వయసు మధ్య ఉన్న యువతను ఓటర్లుగా నమోదు చేయడంతోపాటు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తూ స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇవిఎంల స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద విద్యుత్‌, తాగునీరు, వాహనాల రూట్‌ మ్యాప్‌ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయాలన్నారు. నియోజకవర్గాలలో ప్రతివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతి మండలానికి ఒక మోడల్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుకు వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌ఛార్జ్‌ డిఆర్‌ఒ కె.శ్రీరమణి, కమిషనర్‌ జె.వెంకటరావు, కెఎస్‌ఇజెడ్‌ ఎస్‌డిసి కెవి.రామలక్ష్మి, కాకినాడ, పెద్దాపురం ఆర్‌డిఒలు ఇట్ల కిషోర్‌, జె.సీతారామరావు, బిసి కార్పొరేషన్‌ ఇడి అద్దంకి శ్రీనివాసరావు, డిపిఒ కె.భారతిసౌజన్య, ఎపిఇపిడిసిఎల్‌ ఇఇ ప్రసాద్‌, ఆర్‌టిసి ఆర్‌ఎం ఎం. శ్రీనివాసు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

➡️